Sanjay Raut: అబద్దాలు చెప్పడం బీజేపీ జాతీయ విధానం : యూబీటీ శివసేన ఎంపీ సంజయ్ రౌత్

Maharastra: మహారాష్ట్రలో త్రిభాషా విధానంపై అధికార, ప్రతిపక్షాల మధ్య వివాదం కొనసాగుతోంది. పాఠశాలల్లో త్రిభాషా విధానాన్ని అమలు చేసేందుకు అధికారపక్షం ప్రయత్నాలు చేస్తుండగా, తాము వ్యతిరేకమని ప్రతిపక్షాలు నిరసన ప్రదర్శనలకు దిగుతున్నాయి. ఈ క్రమంలోనే త్రిభాషా విధానంపై గతంలో మాషేల్కర్ కమిటీ ఇచ్చిన నివేదికకు యూబీటీ శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే అంగీకారం తెలిపారని బీజేపీ ఆరోపించింది.
బీజేపీ ఆరోపణలను యూబీటీ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తిప్పికొట్టారు. అబద్ధాలు మాట్లాడటం బీజేపీ జాతీయ విధానంగా మారిపోయిందన్నారు. మహారాష్ట్రలో వాళ్లు ఈ విధానంతోనే పనిచేస్తున్నారని విమర్శించారు. మాషేల్కర్ కమిటీ నివేదికకు థాకరే అంగీకారం తెలిపి ఉంటే అందుకు సంబంధించిన ఆధారాలు బయటపెట్టాలని సవాల్ విసిరారు.
మాషేల్కర్ నివేదిక నాడు కేబినెట్ ముందుకు వచ్చిందా.. కేబినెట్‌లో దానిపై చర్చ జరిగిందా..? అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. ఏదైనా జాతీయ విధానం రాష్ట్రం ముందుకు వచ్చినప్పుడు దానిపై చర్చ జరగడం అనేది చాలా ముఖ్యమన్నారు. మూడు పర్యాయాలు సీఎం అయిన దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఈ విషయం కూడా తెలియదా..? అని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా మహారాష్ట్రలోని ప్రాథమిక పాఠశాలల్లో హిందీని ఒక బోధనా భాషగా ప్రవేశపెట్టాలని ఫడ్నవీస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రాథమిక పాఠశాల స్థాయిలో హిందీని బలవంతంగా ఒక బోధనా భాషగా చేర్చడం కరెక్ట్ కాదని ప్రతిపక్ష శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నిరసనలకు దిగుతున్నాయి.