State Chief Information Commissioner : నేడు మధ్యాహ్నం త్రిసభ్య కమిటీ భేటీ.. గులాబీ అధినేత వచ్చేనా?

State Chief Information Commissioner : స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌తో పాటు సహచర కమిషనర్ల నియామకాలను పూర్తిచేసేందుకు ఇవాళ త్రిసభ్య కమిటీ సమావేశం కానుంది. సచివాలయంలో మధ్యాహ్నం ఒంటి గంటకు అధికారులు షెడ్యూల్ కూడా ఖరారు చేశారు. స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ గడువు గతేడాది ఫిబ్రవరి చివరి వారంలో పూర్తైంది. ఇప్పటికే కొత్త కమిషన్ బాధ్యతలు స్వీకరించాల్సి ఉన్నా నియామకంపై పాలనాపరమైన సమస్యలు నెలకొనడంతో ప్రకియ వాయిదా వేస్తూ వస్తున్నారు. కొత్త కమిషన్ నియామకంలో జాప్యంపై ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ క్రమంలోనే హైకోర్టులో విచారణ కూడా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కొత్త కమిషన్ నియామకంపై దృష్టి పెట్టింది. మరికాసేపట్లో సచివాలయం వేదికగా త్రిసభ్య కమిటీ సమావేశం కానుంది.
సమావేశానికి గులాబీ అధినేత వస్తారా లేదా..?
స్టేట్ ఇన్ఫర్మేషన్ చీఫ్ కమిషనర్‌తోపాటు సహచర కమిషనర్ల ఎంపిక కమిటీలో చైర్మన్‌గా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సభ్యులుగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఉన్నారు. ముగ్గురు సమావేశం అయి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఐఏఎస్ అధికారులు స్క్రూట్నీ చేసిన దరఖాస్తుల్లో 7 మందని ఎంపిక చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడే అసలు సమస్య వచ్చింది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు అవుతారా.. లేదా? అనే సందిగ్ధం నెలకొంది. ఇప్పటికే కేసీఆర్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేవలం గవర్నర్ ప్రసంగం రోజు మాత్రమే సభకు హాజరయ్యారు. ఆ తర్వాత మళ్లీ అసెంబ్లీలో అడుగు పెట్టలేదు. అనంతరం రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇచ్చిన తేనీటి విందుకు డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే.
కేసీఆర్ రావడం అనుమానమే..
అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ఈ పరిణామల నేపథ్యంలో ఆర్టీఐ కమిషనర్ల ఎంపిక సమావేశానికి కేసీఆర్ రావడం అనుమానమేనని అటు అధికార పార్టీలో ఇటు బీఆర్ఎస్ పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. ఒకవేళ కేసీఆర్ సమావేశానికి హాజరైతే ఆయన ఇచ్చే సలహాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. రాని పక్షంలో సమావేశానికి గైర్హాజరయ్యారని మినిట్స్‌లో నోట్ చేసి స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌తో పాటు సహచర కమిషనర్ల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉంది. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ పోస్టుకు ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో సహా పలువురు పోటీ పడుతున్నట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది.