MLC Gade Srinivasulu Naidu : ఉత్తరాంధ్ర టీచర్ ఎన్నికల్లో గాదె శ్రీనివాసులు నాయుడు విజయం

MLC Gade Srinivasulu Naidu : ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠంగా కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. 11గంటల పాటు కొనసాగిన ఓట్ల లెక్కింపులో కూటమి బలపర్చిన ఏపీటీఎఫ్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘువర్మపై నాయుడు రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందారు.
శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం ఎమ్మెల్సీ స్థానంలో 8మందిని అధికారులు ఎలిమినేట్ చేశారు. ఈ మేరకు విజేతను అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఈ స్థానంలో మొత్తం 10మంది బరిలో ఉండగా, 8 మందిని ఎలిమినేట్ చేశారు. మూడో స్థానంలో నిలిచిన పీడీఎఫ్ అభ్యర్థి విజయగౌరి ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా గాదె శ్రీనివాసులు నాయుడు మ్యాజిక్ ఫిగర్‌ను సాధించి విజయం సాధించారు.
విశాఖపట్నంలోని ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఉత్తరాంధ్రలో మొత్తంగా 20,783 ఓట్లకు గాను 19,813 ఓట్లు మాత్రమే చెల్లినవిగా అధికారులు గుర్తించారు. దాదాపు 1000కి పైగా ఓట్లు చెల్లనివిగా మిగిలాయి. ఈ స్థానానికి మ్యాజిక్ నంబర్ 10,068 ఓట్లుగా ఉండగా, తొలి నంచి ఆధిక్యంలో కొనసాగిన పీఆర్టీయూ అభ్యర్థి శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు.