Telangana Assembly: తెలంగాణ తల్లి అంటే భావన మాత్రమే కాదు.. 4 కోట్ల బిడ్డల భావోద్వేగం.. అసెంబ్లీలో సీఎం
Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. డిసెంబర్ 9 తెలంగాణ పర్వదినం అని పేర్కొన్నారు. 2009 డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ఆకాంక్షను ఆనాడు కేంద్ర హోం శాఖ చిదంబరం ముందుకు తీసుకెళ్లారు. అలాగే సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా 60 ఏళ్ల తెలంగాణ ఆకాంక్ష, 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేశారో.. ఆ ఆకాంక్షను నెరవేరడానికి డిసెంబర్ 9న పునాది పడిందన్నారు. అనంతరం సోనియాగాంధీకి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలు భావోద్వేగాలతో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారన్నారు. ఆ ప్రత్యేకమైన సందర్భంతోపాటు తెలంగాణ తల్లికి సంబంధించిన చర్చలు జరిగాయన్నారు. అందుకే ఈ శాసనసభలో తెలంగాణ తల్లికి సంబంధించిన ప్రత్యేకమైన చర్చ, ప్రకటన ద్వారా భవిష్యత్తు కార్యాచరణ నిర్ధారించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. అందులో భాగంగానే చరిత్ర ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల గుండెల్లో మధురమైన నిలిచే పోయే అంశాన్ని పవిత్రమైన శాసనసభలో ఈ వ్యాఖ్యలు ప్రస్తావిస్తున్నాన్నారు.
నా తెలంగాణ.. కోటి రతనాలవీణ.. నా తెలంగాణ తల్లి.. కంజాత వల్లి అన్న మహాకవి దాశరథి మాటలు నిత్య సత్యాలన్నారు. తెలంగాణ జాతికి నిరంతర స్ఫూర్తి వ్యాఖ్యలు. ఈ ప్రపంచంలో ఏ జాతికైనా గుర్తింపు, గౌరవం.. ఆ జాతి అస్తిత్వాలేనని వివరించారు. ఆ అస్తిత్వానికి మూలం సంస్కృతి.. ఆ సంస్కృతికి ప్రతిరూపమే తల్లి అన్నారు. స్వరాష్ట్ర సుదీర్ఘ పోరాట ప్రస్థానంలో సకలజనులను, సబ్బండ వర్గాలను ఐక్యం చేసి నడిపించిన శక్తి స్వరూపిణీ తెలంగాణ తల్లి అన్నారు. 4 కోట్ల ప్రజల ఆలోచన, ఆచరణ, కార్యచరణలను ఒక్కచోటకు చేర్చి తెలంగాణ భావనకు జీవం పోసిన మాతృమూర్తి తెలంగాణ తల్లి అని పేర్కొన్నారు.
మనల్ని నిరంతరం చైతన్యపరిచి లక్ష్యసాధన వైపు నడిపించిన స్ఫూర్తి తెలంగాణ తల్లి అని, అలాంటి తెలంగాణ తల్లి స్వరూపంపై పలు రూపాలు ఇప్పటికీ జనాల్లో ఉన్నాయన్నారు. అయితే ఇప్పటివరకు అధికారిక గుర్తింపు లేదని, అధికారికంగా మనం గౌరవించుకోలేదన్నారు. తెలంగాణ నేల.. స్వేచ్ఛ కోసం పిడికిళ్లు బిగించిన ఉత్తేజపు జ్వాల, సకల జనులు ఒక్కటై గర్జించిన ఉద్వేగపు మాల అన్నారు. అటువంటి అనేక ప్రజా పోరాటాలకు ఊపిరి పోసిన మాతృమూర్తిని గౌరవించుకోవాలనే లక్ష్యంతో నేడు ప్రజా ప్రభుత్వం.. తెలంగాణ తల్లిని రూపకల్పన చేసిన రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ఆవిష్కరణ చేసే ఉత్సవానికి శ్రీకారం చుట్టిందన్నారు.
తెలంగాణ తల్లి అంటే భావన మాత్రమే కాదని.. 4 కోట్ల బిడ్డల భావోద్వేగమని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆ భావోద్వేగానికి నిండైన రూపం తెలంగాణ తల్లి అన్నారు. ప్రజల మనోపలకాలపై నిలిచిన తెలంగాణ తల్లి రూపాన్ని నేడు సచివాలయం సాక్షిగా ఆవిష్కరించేందుకు ప్రజా ప్రభుత్వం సిద్ధమైందని, ఈ పవిత్ర సభ సాక్షిగా మీ అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నానని రేవంత్ రెడ్డి అన్నారు.