CM Revanth Reddy: తెలంగాణ సర్కార్ అండ.. ఆర్ధిక సాయం ప్రకటించిన సీఎం రేవంత్

CM Revanth Reddy:సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో మృతి చెందిన కుటుంబాలకు తెలంగాణ సర్కార్ తక్షణ సాయం ప్రకటించింది. ఈ ఘటనలో మరణించిన మృతుల కుటుంబాలకు రూ.లక్ష తక్షణ సాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గాయపడ్డ వారికి రూ.50 వేల చొప్పున ప్రభుత్వం సాయం చేయనుంది. ఇది నష్టపరిహారం కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, ఖర్చును భరించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ఫ్యాక్టరీని ఆయన సందర్శించారు.
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి ఫార్మ కంపెనీలో సోమవారం రియాక్టర్ పేలింది. ఈ భారీ అగ్నిప్రమాదంలో సుమారు 70 మందికిపైగా గాయపడ్డారు. వారిలో 39 మంది చనిపోయారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుంది. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఘటన స్థలాన్ని పరిశీలించారు. . సీఎంతో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, వివేక్, పొంగులేటి శ్రీనివాస్ ఉన్నారు. అక్కడి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను రేవంత్ రెడ్డి పరామర్శించారు. గాయపడ్డ వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
పరిశ్రమలో భద్రతపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. యాజమాన్యం కూడా భద్రతపై దృష్టి పెట్టాలని సూచించారు. బాధిత పిల్లల చదువు బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా పరిశ్రమలను అప్రమత్తం చేస్తామన్నారు. వైద్య చికిత్స విషయంలో ఎవరికీ ఆందోళన అక్కర్లేదన్నారు. ఇలాంటి ఘటన తెలంగాణలో ఇంతవరకు జరగలేదని, పాశమైలారం ఘటన దురదృష్టకరం అన్నారు.