Sigachi Factory: సంగారెడ్డి ప్రమాదంలో 37కి చేరిన మృతుల సంఖ్య

Explosion In Industry: సంగారెడ్డి జిల్లా పాశమైలాంరంలోని సిగాచి ఫార్మాలో జరిగిన పేలుళ్లలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నిన్న జరిగిన భారీ పేలుడు పెను విషాదాన్ని మిగిల్చింది. రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదంగా నిలిచింది. ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య ఇప్పటివరకు 37కి చేరింది. మరో 35 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో 12 మంది పరిస్థితి ఇంకా విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. కాగా ప్రమాదంలో 20 మంది కార్మికుల జాడ తెలియలేదు. మృతుల్లో ఇప్పటివరకు నలుగురిని మాత్రమే గుర్తించారు. మరోవైపు ప్రమాద స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. ఇవాళ ఉదయం వర్షం కాస్త ఆగడంతో రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరం చేశారు.
కాగా నిన్న ఉదయం 9.30 గంటల సమయంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి 100 మీటర్ల ఎత్తుకు మంటలు ఎగసిపడ్డాయి. రెండు కిలోమీటర్ల వరకు పేలుడు శబ్దం వినిపించింది. భూకంపం వచ్చిందేమోనని పాశమైలారం ప్రజలు భయాందోళన చెందారు. నిన్న ఉదయం 118 మంది కార్మికులు డ్యూటీకి వచ్చారు. వీరితో పాటు 32 మంది అడ్మినిస్ట్రేషన్, సెక్యూరిటీ సిబ్బంది ముగ్గురు డ్యూటీలో ఉన్నారు. రియాక్టర్ పేలడం వల్లనే ప్రమాదం జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పేలుడు ధాటికి కంపెనీలో మూడంతస్తుల అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కుప్పకూలింది. మంటలు చెలరేగడంతో కంపెనీలో భారీగా పొగ అలముకుంది. దీంతో చాలా మంది కార్మికులు మంటలు, పొగలో చిక్కుకుని ఊపిరి ఆడక చనిపోయారు.
సంగారెడ్డి జిల్లాలోని సిగాచి ఇండస్ట్రీలో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ పరిశీలించనున్నారు. ఉదయం 10 గంటలకు మంత్రులు శ్రీధర్ బాబు, జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహా, ఇంఛార్జ్ మంత్రి వివేక్ తో కలిసి ఘటనా స్థలానికి వెళ్లనున్నారు. అనంతరం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్నారు.