Published On:

Kishan Reddy: సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సవాల్

Kishan Reddy: సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సవాల్

Union Minister Kishan Reddy Challenges CM Revanth Reddy: తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఏ మాత్రం సహకరించడం లేదంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. ఆదివారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి అంటే ఏమిటో ప్రధాని మోదీని చూసి తెలుసుకోమంటూ రేవంత్‌రెడ్డికి హితవు పలికారు.

 

తెలంగాణకు కేంద్రం చేసిన అభివృద్ధిపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. చర్చకు నువ్వు సిద్ధమా? అంటూ ముఖ్యమంత్రికి కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. రాజకీయాల కోసం ఇలా మాట్లాడితే ఎలా అంటూ సీఎంను సూటిగా ప్రశ్నించారు. మీరు, మీ మంత్రివర్గ సహాచరులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు.

 

తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై మంగళవారం క్లారిటీ వస్తుందని చెప్పారు. రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఇవాళ వస్తుందని పేర్కొన్నారు. సోమవారం నామినేషన్లు వేస్తారని తెలిపారు. మంగళవారం నూతన అధ్యక్ష పదవిపై ప్రకటన వస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ అధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవం చేయాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించనున్న సునీల్ బన్సల్, శోభా కర్లందాజ్లే సోమవారం రాష్ట్రానికి రానున్నారని పేర్కొన్నారు. వారి సమక్షంలో నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు.

 

ముఖ్యమంత్రి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. నిజామాబాద్‌లో ఆదివారం పసుపు బోర్డు ప్రారంభిస్తున్నామని తెలిపారు. తాము తెలంగాణ ప్రజల కోసం పని చేస్తామని, రేవంత్, కాంగ్రెస్ కోసం తాము పని చేయబోమని కిషన్‌రెడ్డి కుండ బద్దలు కొట్టారు. మెట్రో డీపీఆర్ గత వారం కేంద్రానికి ఇచ్చారన్నారు. మెట్రో రైలు సాధ్యాసాధ్యాలపై కేంద్రం పరిశీలన చేస్తుందని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి: