Last Updated:

Supreme Court : సినిమా థియేటర్లలోకి మీరు ఆహారం తీసుకెళ్లొచ్చు… కానీ… సుప్రీం కోర్టు తీర్పు

Supreme Court : సినిమా థియేటర్లలోకి మీరు ఆహారం తీసుకెళ్లొచ్చు… కానీ… సుప్రీం కోర్టు తీర్పు

Supreme Court : సినిమా థియేటర్లలో బయటి ఆహారాన్ని అనుమతించే విషయంలో సుప్రీం కోర్టు తాజాగా కీలక తీర్పునిచ్చింది. బయటి నుంచి తెచ్చుకునే ఆహారంపై నిషేధం విధించే హక్కు థియేటర్‌ యాజమాన్యాలకు ఉంటుందని తేల్చి చెప్పింది. గత కొంత కాలంగా థియేటర్లలో తినుబండారాలను అనుమతించే విషయం గురించి వివాదం నడుస్తోంది. కాగా 2018లో జమ్మూ కాశ్మీర్ హైకోర్టు థియేటర్స్ లోకి బయట నుంచి తెచ్చుకునే ఆహారంపై నిషేధాన్ని ఎత్తివేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతో తమకు నష్టం వస్తుందని కోర్టు ఇచ్చిన తీర్పుని సవాలు చేస్తూ థియేటర్ల యాజమాన్యాలు, మల్టిప్లెక్స్ అసోసియేషన్ అఫ్ ఇండియా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఈ పిటిషన్ పై సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. అనేక చర్చలు, వాయిదాల అనంతరం మంగళవారం నాడు దీనిపై సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. థియేటర్స్ లోకి బయటి ఫుడ్ నిషేధం పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి గతంలో జమ్మూకశ్మీర్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. సినిమా హాలు అనేది ప్రైవేట్ ఆస్తి కాబట్టి బయటి నుంచి ఆహారాన్ని అనుమతించాలా? వద్దా? అనే అధికారం థియేటర్ల యాజమాన్యాలకు ఉంటుంది. అయితే థియేటర్స్ లోపల ఆహార పదార్థాలని కొనుగోలు చేయమని ప్రేక్షకులని ఇబ్బందిపెట్టకూడదని వివరించింది.

కానీ చిన్నారులు, పిల్లల కోసం ఆహారం తెచ్చుకునే తల్లిదండ్రులను అనుమతించాలని సూచించింది. ప్రేక్షకులందరికీ కచ్చితంగా తాగునీరు ఉచితంగా అందుబాటులో ఉంచాలని సూచించింది. ఎక్కడ సినిమా చూడాలి? ఏ థియేటర్ లో చూడాలి? అక్కడ అమ్మేవాటిని కొనాలా? వద్దా? అని నిర్ణయించుకునే హక్కు ప్రేక్షకుడికి ఎలా ఉంటుందో అలాగే అక్కడకి బయటి ఆహారంపై షరతులు విధించాలా? వద్దా? అనే హక్కు కూడా ఉంటుందని వెల్లడించింది.

‘ఎవరైనా వ్యక్తి బయటి నుంచి సినిమా హాలులోకి జిలేబీ తెచ్చుకున్నాడను కుందాం… అతడు జిలేబీ తిని సీటుకు చేతిని రాసెయ్యొచ్చు. అప్పుడది అనవసరంగా పాడు చేసినట్టు అవుతుంది’ అని వ్యాఖ్యానించారు. అదే విధంగా చికెన్ తెచ్చుకొని తిన్న తర్వాత ఎముకలు అక్కడదే వేస్తే… ఆ తర్వాత థియేటర్లు శుభ్రంగా లేవు ఎముకలు వేస్తున్నారని అంటారు అని పలు ఉదాహరణలు ఇచ్చారు. ఈ తీర్పు పట్ల థియేటర్, మల్టీప్లెక్స్ యాజమాన్యాలు సంతోషం వ్యక్తం చేస్తుండగా… ప్రేక్షకులు మాత్రం అసహనం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి: