Supreme Court: ఓటీటీ, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు సుప్రీం కోర్టు నోటీసులు

Supreme Court Issued Notice To OTT and Social Media Platforms: ప్రముఖ ఓటీటీ, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఈ మేరకు దిగ్గజ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు నోటీసులు ఇచ్చింది. ఓటీటీలో అశ్లీల. అసభ్య కంటెంట్‌పై నిషేధం విధించాలని ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎలాంటి చెకింగ్ లేకుండా ఓటీటీలో అసభ్య కంటెంట్ ప్రసారం చేస్తున్నారని పిటిషన్‌ర్ ఆరోపించారు. దీంతో ఓటీటీలో అభ్యంతరకర కంటెంట్ నిషేధంపై జవాబు చెప్పాలని ఇప్పటికే సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
కేంద్రం వివరణకు ఆదేశం
తాజాగా పలు ఓటీటీలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కి సైతం అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఇవాళ (సోమవారం) ఈ పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. A రేటింగ్ ఉన్న కంటెంట్‌తో పాటు అశ్లీల కంటెంట్‌ను అందుబాటులో ఉంచడం చట్టరిత్యా నేరమని, వీటిని కట్టడి చేసేలా నిబంధనలను రూపొందించాల్సింది కేంద్రమేనని జస్టిస్ బి.ఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం ఇప్పటికే పేర్కొంది. ఈ విషయంలో కేంద్రంతో పాటు పలు ఓటీటీ సంస్థలు వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ సోమవారం నోటీసులు ఇచ్చింది.
నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ కు నోటీసులు
దీంతో కేంద్రంతో సహా ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైం, ఆల్ట్‌టీ, ఉల్లు ఓటీటీతో పాటు ఎక్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లకు సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది. మరోవైపు ఈ పిటిషన్‌పై విచారణ సమయంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి లైంగిక అసభ్యకరమైన కంటెంట్ పిల్లలు, యువతతో పాటు పెద్దలపై కూడా ప్రభావం చూపుతుంది, వారి ఆలోచన ధోరణి మారే అవకాశం ఉందని పేర్కొంది. ఇది వికృతమైన, అసహజమైన లైంగిక ధోరణులకు దారి తీస్తుందని అత్యున్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది.