Padi Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి నోటీసులు.. పోలీస్‌స్టేషన్‌కు రావాలని ఆదేశం
Police Issued Notice To MLA Kaushik Reddy: హుజూరాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 27న ఉదయం 10గంటలకు పోలీస్‌స్టేషన్‌కు హాజరుకావాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించాడంటూ గతంలో ఎమ్మెల్యేపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కౌశిక్‌రెడ్డితోపాటు 20మంది అనుచరులను నిందితులుగా పోలీసులు చేర్చారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఐజీ శివధర్‌రెడ్డి తన ఫోన్ టాప్ చేస్తున్నారంటూ ఫిర్యాదు చేయడానికి వచ్చిన సమయంలో సీఐతో ఎమ్మెల్యే వాగ్వాదానికి దిగారు. ఈ కేసులో కౌశిక్‌రెడ్డిని ఈ నెల 6న పోలీసులు అరెస్టు చేశారు. కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేసి న్యాయస్థానం ఎదుట హాజరు పర్చగా, కోర్టు వెంటనే బెయిల్ మంజూరు చేసింది.
ఈ నెల 27న విచారణకు హాజరుకావాలి..
ఈ నెల 27న మరోసారి వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని మాసబ్ ట్యాంక్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. మాసబ్ ట్యాంక్ పోలీసుల ఎదుట హాజరుకావాలని ఆదేశించారు. బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్ర ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేపై మాసబ్‌ట్యాంక్ పోలీసులు కేసు నమోదు చేసి, విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈ నెల 6న ఎమ్మెల్యే అరెస్టు..
ఈ నెల 6న గచ్చిబౌలిలోని తన ఇంట్లో ఎమ్మెల్యేను కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేసి నేరుగా న్యాయస్థానం ఎదుట హాజరుపర్చారు. అయితే వెంటనే కౌశిక్‌రెడ్డికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. కానీ, ఎప్పుడు విచారణకు పిలిచినా సహకరించాలని, విచారణకు హాజరుకావాలని గతంలో బెయిల్ ఇచ్చిన సమయంలో కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈ నెల 27న మరోసారి మాసబ్‌ట్యాంక్ పోలీసుల ఎదుట కౌశిక్‌రెడ్డి విచారణకు హాజరుకావాల్సి ఉంది.
ఇది నేపథ్యం..
ఈ నెల 4న ఎమ్మెల్యేతోపాటు దాదాపు 20మంది తన అనుచరులతో కలిసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అదే సమయంలో ఎస్‌హెచ్‌వోగా ఉన్న సీఐ రాఘవేంద్ర వేరే పనిమీద బయటకు వెళ్తున్నారు. ఈ క్రమంలో సీఐతో ఎమ్మెల్యే వాగ్వాదానికి దిగారు. సీఐకి సంబంధించిన వాహనాన్ని అడ్డుకోవడంతోపాటు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో సీఐకు, ఎమ్మెల్యేకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తన విధులకు ఆటంకం కలిగించారంటూ రాఘవేంద్ర ఫిర్యాదు చేయగా, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మరింత విచారణ కోసం కౌశిక్‌రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. మరోసారి ఎమ్మెల్యేను విచారించి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసే అవకాశం ఉంది.