YS Jagan on Chandrababu: ఏపీలో బీహార్ తరహా పరిస్థితులు.. చంద్రబాబు సర్కారుపై జగన్ సంచనల ఆరోపణలు!

YS Jagan Allegations Against Chandrababu Naidu Government: రాప్తాడు నియోజకవర్గం పాపిరెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం వైఎస్ జగన్ పర్యటించారు. గ్రామానికి చెందిన వైసీపీ నేత కురుబ లింగమయ్య కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబాన్ని ఓదార్చారు. అసలు దాడి ఎలా జరిగింది.. ఎంత చేశారని అడిగి తెలుసుకున్నారు. లింగమయ్య కుటుంబానికి పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ఏపీలో బీహార్ తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆరోపించారు. ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయన్నారు. ఏపీలో రెడ్‌బుక్ పరిపాలన నడుస్తోందని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు ఎంత భయపెట్టినా, ప్రలోభాలు పెట్టినా ఎంపీపీ ఎన్నికల్లో వైసీపీ గెలిచిందన్నారు. వైసీపీ గెలిచిన చోట్ల చంద్రబాబు హింసను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.
స్థానిక ఎన్నికల్లో దౌర్జన్యం..
స్థానిక ఎన్నికల్లో అడుగడుగునా దౌర్జన్యాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. రాప్తాడులో జరిగిన ఘటన బాధాకరమన్నారు. ఏపీలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రతిఒక్కరూ ఆలోచించుకోవాలని సూచించారు. ఏపీలో శాంతి భద్రతలు లేవన్నారు. ఎన్నికలు జరిగిన 57 స్థానాల్లో టీడీపీకి బలం లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు ఎన్ని ప్రలోభాలు పెట్టినా 39 స్థానాల్లో వైసీపీ గెలుపొందిందన్నారు. టీడీపీకి అనుకూలంగా లేదని ఏడు చోట్ల ఎన్నికలు వాయిదా వేయించారని ఫైర్ అయ్యారు. రామగిరిలో 9 ఎంపీటీసీ స్థానాలను వైసీపీ గెలిచిందని, టీడీపీ నేతలు ఎంపీపీ కోసం ప్రయత్నించి విఫలమయ్యారన్నారు. ఈ ఘటన తర్వాత 20 మంది దాడి చేసి లింగమయ్యను హత్య చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. లింగమయ్య హత్య కేసులో ఇద్దరిపై కేసులు పెట్టారని, ఎస్ఐ సుధాకర్‌పై ఎందుకు చర్యలు తీసుకోరు? అని నిలదీశారు..
లింగమయ్య భార్యతో బలవంతంగా వేలిముద్ర..
లింగమయ్య భార్యతో బలవంతంగా వేలిముద్ర తీసుకుని కేసును బిల్డప్ చేశారని, అసలు నిందితులను వదిలేసి తూతూమంత్రంగా ఇద్దరిపై కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. పోలీసులే ఇష్టం వచ్చిన స్టేట్‌మొత్తం రాసుకొని చదువురాని లింగమయ్య భార్యతో వేలిముద్ర తీసుకున్నారని విమర్శించారు. బేస్ బాల్ బ్యాట్‌తో కొట్టి చంపారని ఆరోపించారు. విషయాన్ని పోలీసులు ఎక్కడా ప్రస్తావించలేదని ఫైర్ అయ్యారు. చిన్న కర్రలతో కొట్టారని, కేసును తప్పుదారి పట్టించేలా రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షులను కూడా నిందితులకు సంబంధించిన వారిని తీసుకోవడం దారుణమన్నారు.