CM Revanth Reddy: తెలంగాణపై కేంద్రం వివక్ష.. మార్చి నాటికి అర్హులకు పథకాలు
CM Revanth Reddy Powerful Speech in Republic Day: గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. రెగ్యులర్ కాలేజీల విద్యార్థులకు ఇస్తున్నట్లుగానే, ఇకపై, ఓపెన్ యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్ మెంట్ అందించబోతున్నట్లు ఆయన ప్రకటించారు. జూబ్లీహిల్స్‌లోని డా. బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో అనంతరం.. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, డిజిటల్ రిసోర్స్ సెంటర్, సెంట్రల్ ఇన్స్ట్ర్‌మెంటేషన్, ఎసెన్షియల్ స్టాఫ్ క్వార్టర్స్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే, అక్కడ ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై మాట్లాడారు.
విద్యపై ప్రత్యేక ఫోకస్..
తాను సీఎం కాగానే మంత్రుల ఎంపికకు ఎంత కసరత్తు చేశానో, అంతే కసరత్తు యూనివర్సిటీ వీసీల విషయంలో చేశానని ముఖ్యమంత్రి వెల్లడించారు. అంతటితో సరిపెట్టుకోకుండా, రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేయాలని ఆయన వీసీలను ఆదేశించామని గుర్తుచేశారు. ఓపెన్ యూనివర్సిటీలో ఫీజులు తక్కువే ఉంటాయి గనుక ఇక్కడ చదివే విద్యార్థులకూ ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తామని, అందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారికి ఆదేశాలు జారీ చేశారు.
కేంద్రం కుట్రలు ఆపాలి..
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్.. కొత్త నిబంధనలను అడ్డుపెట్టుకుని కేంద్ర ప్రభుత్వం దేశంలోని విశ్వవిద్యాలయాల మీద పరోక్షంగా పెత్తనం చెలాయించాలని చూస్తోందని, ఇది మంచి విధానం కాదని సీఎం విమర్శించారు. ఇకనైనా కేంద్రం.. రాష్ట్రాల హక్కులను గుంజుకునే యత్నం మానుకోవాలని హితవు పలికారు. వీసీలను తమ నియంత్రణలోకి తీసుకోవాలనుకుంటున్న కేంద్రం ఆలోచనను తాము రాజ్యాంగం మీద దాడిగానే చూస్తామన్నారు.
తెలంగాణపై వివక్ష
పద్మ పురస్కారాల ప్రకటనలో తెలంగాణకు అవమానం జరిగిందని సీఎం రేవంత్ అభిప్రాయపడ్దారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన గద్దర్ (పద్మవిభూషణ్), చుక్కా రామయ్య (పద్మభూషణ్), అందెశ్రీ (పద్మభూషణ్), గోరటి వెంకన్న (పద్మశ్రీ), జయధీర్ తిరుమలరావు (పద్మశ్రీ) వంటి ప్రముఖుల పేర్లను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది కచ్చితంగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను అవమానించడమేనని, ఈ అన్యాయంపై తాను త్వరలో ప్రధాని మోదీకి లేఖ రాస్తానని ప్రకటించారు.
రైతు భరోసా నిధుల విడుదల
మరోవైపు, తెలంగాణ రైతాంగానికీ సీఎం గుడ్ న్యూస్ చెప్పారు. ఆదివారం నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచలో ఆదివారం జరిగిన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ళు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడి బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ, ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నామన్నారు. రైతుభరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను తొలుత 621 గ్రామాల్లోనే అమలు చేస్తున్నామని, మార్చ్ నాటికి చివరి లబ్ది దారుకూ సాయం అందిస్తామని క్లారిటీ ఇచ్చారు. 621 గ్రామాల్లోని రైతులకు.. నేటి అర్థరాత్రి నుంచే రైతు భరోసా కింద రైతులకు రూ.12 వేలు, రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో రూ.12 వేలు వారి ఖాతాల్లో జమ కానున్నాయన్నారు. తమది రైతు మేలుకోరే ప్రభుత్వమని, దేశంలో ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేసిన చరిత్ర తమదేనని అన్నారు. ఎలాంటి పదవులు లేకపోయినా, ప్రజలతో మమేకమై పనిచేస్తున్న తమ కుటుంబ సభ్యలు మీద బీఆర్ఎస్ అనవసరంగా ఆరోపణలు చేస్తోందని సీఎం మండిపడ్డారు.
తెలంగాణలో ప్రజాపాలన
గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆదివారం సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ మాట్లాడుతూ.. ప్రజాప్రభుత్వం తెలంగాణ సంస్కృతికి పెద్దపీట వేస్తోందని, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే క్రమంలోనే అందెశ్రీ రాసిన జయజయహే గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించామని తెలిపారు. రాష్ట్ర ఆర్థికరంగానికి వెన్నెముకగా ఉన్న రైతాంగాన్ని ఆదుకునేందుకు 25 లక్షల మంది రైతులకు రుణాలు మాఫీ చేశామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం కర్షకులకు రైతు భరోసా పథకాన్ని, రైతుకూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రూ. 12 వేలు అందిస్తోందన్నారు. సన్నాలకు బోనస్ అందించటంతో బాటు 2024 వానాకాలంలో 1.59 కోట్ల టన్నుల ధాన్యాన్ని తెలంగాణ ఉత్పత్తి చేసిందని గవర్నర్ ప్రస్తావించారు. మహిళలకు ఉచిత బస్సు రవాణా కల్పించడంతో రూ.4500 కోట్లు ఆదా చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, పాల్గొన్నారు.