US-Ukraine: ఉక్రెయిన్‌కు హ్యాండ్ ఇచ్చిన అమెరికా.. యూరప్ దేశాల ప్లాన్ ఏమిటి?

US pauses intelligence sharing with Ukraine: ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో అమెరికా ఇప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అమెరికా నిర్ణయాలతో గొంతులో పచ్చివెలక్కాయ పడ్డ పరిస్థితి ఉక్రెయిన్‌ది. అటు యూరప్ మీద కూడా అమెరికా ఒక్కొక్క షాక్ ఇస్తోంది. నాటోలో ఎప్పటికీ ఉక్రెయిన్ భాగస్వామి కాలేదని అమెరికా తేల్చి చెప్పింది. యుద్ధం ఆపటానికి ఇప్పటికే సైనిక సాయం ఆపేసిన అమెరికా, నిఘా సమాచారాన్ని కూడా ఆపేసింది.అంతేకాదు.. అమెరికా వచ్చిన లక్షల మంది ఉక్రెయిన్ శరణార్థులను అక్రమ వలసదారులుగా గుర్తిస్తూ వెనక్కి పంపిస్తామని అంటోంది. ఇంతకీ అమెరికా తీసుకుంటున్న చర్యలు ఏమిటి? యూరప్ దేశాల ప్లాన్ ఏమిటి? ఈ పరిణామాలన్నీ ఏ దిశగా వెళ్లబోతున్నాయో చూసేద్దాం.
ఐరోపా దేశానికి రష్యాతో ప్రమాదం పొంచి ఉందని ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ అన్నారు. కాగా, వేల సంఖ్యల్లో ట్యాంకర్లు, వందల సంఖ్యలో యుద్ధ విమానాలు అడిషనల్ చేస్తుందని క్రెమ్లిన్ అన్నారు. బడ్జెట్‌లో 40 శాతం నిధులను రక్షణపైనే మాస్కో ఖర్చుపెడుతోందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రేక్షకుడిగా ఉండటం పిచ్చితనమే అవుతుందని, ఆ దేశాన్ని నిలువరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఫ్రాన్స్ తన అణ్వస్త్రాలతో ఐరోపాను రక్షించడానికి సిద్ధంగా ఉందని.. ఈ విషయంపై ఇతర మిత్రదేశాలతో చర్చిస్తానని తెలిపారు. ఐరోపా భవిష్యత్తును వాషింగ్టనో, మాస్కోనో నిర్ణయించకూడదని అన్నారు. ఉక్రెయిన్‌కు ఐరోపా దీర్ఘకాలం అండగా నిలవాలని పిలుపునిచ్చారు. అవసరమైతే ఐరోపా దళాలను ఆ దేశంలో మోహరించాలని పిలుపునిచ్చారు.
ఉక్రెయిన్‌కు సైనిక సహాయాన్ని నిలిపివేసిన అమెరికా.. తాజాగా రష్యాకు సంబంధించిన నిఘా సమాచార మార్పిడిని కూడా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. రష్యాతో శాంతి చర్చలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై ఒత్తిడి తెచ్చేందుకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అమెరికా తీసుకున్న తాజా నిర్ణయంతో రష్యాకు చెందిన వ్యూహాత్మక బాంబర్ విమానాల కదలికలు, విధ్వంసక క్షిపణుల ప్రయాగాలు ఉక్రెయిన్‌కు ఇక తెలిసే అవకాశం ఉండదు.దీంతో ఫ్రాన్స్ రంగంలోకి దిగింది. కీవ్‌కు అండగా ఉంటామని పేర్కొంది. తాము ఎప్పటికప్పుడు నిఘా సమాచారాన్ని ఉక్రెయిన్‌తో పంచుకుంటామని తెలిపింది.
గత శుక్రవారం అమెరికా అధ్యక్షుడికి, ఉక్రెయిన్ అధ్యక్షుడికి జరిగిన వాగ్యుద్ధం ఫలితంగా అమెరికా ఉక్రెయిన్‌కు సైనిక సహాయాన్ని నిలిపివేయగా తాజాగా నిఘా సమాచార మార్పిడి నిలిపివేతతో ఉక్రెయిన్ భారీగా ప్రాణనష్టాన్ని చవిచూసే ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో ఉక్రెయిన్‌కు బలమైన మద్దతుదారుగా ఉన్న అమెరికా తన వైఖరిని మార్చుకుని రష్యాతో రాజీమార్గంలో యుద్ధ సమస్యను పరిష్కరించడానికి చేస్తున్న ప్రయత్నాలు జెలెన్‌స్కీకి మింగుడుపడడం లేదు. అయితే సైనిక సాయం, నిఘా సమాచార మార్పిడిపై విధించిన నిషేధాలు తాత్కాలికమేనని, శాంతి చర్చలు పురోగతిని బట్టి వాటిని తొలగించడం జరుగుతుందని సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్‌క్లిఫ్ బుధవారం వెల్లడించారు. జెలెన్‌స్కీ ప్రత్యర్థులతో ట్రంప్ టీమ్ రహస్య చర్చలు ట్రంప్ వెంట పర్యటనల్లో పాల్గొనే నలుగురు సీనియర్ సభ్యులు జెలెన్‌స్కీ రాజకీయ ప్రత్యర్థులతో రహస్యంగా చర్చలు జరిపినట్టు పొలిటికో పత్రిక బుధవారం వెల్లడించింది. ఉక్రెయిన్ ప్రతిపక్ష నాయకుడు యూలియా టైమోషెంకో, మాజీ అధ్యక్షుడు పెట్రో పోరోషెంకోకు చెందిన పార్టీలోని సీనియర్ సభ్యులతో ఈ చర్చలు జరిగినట్టు పత్రిక తెలిపింది. ఉక్రెయిన్‌లో వెంటనే అధ్యక్ష ఎన్నికలు జరిగే అవకాశంపై చర్చలు జరిగినట్టు ముగ్గురు ఉక్రెయిన్ పార్లమెంట్ సభ్యులను, అమెరికాకు చెందిన ఓ విదేశాంగ విధాన నిపుణుడిని ఉటంకిస్తూ పత్రిక పేర్కొంది. ఉక్రెయిన్‌కు ఫ్రాన్స్ నిఘా సాయం రష్యాకు చెందిన సైనిక నిఘా సమాచారాన్ని నిలిపివేస్తున్నట్టు అమెరికా ప్రకటించిన దరిమిలా ఉక్రెయిన్‌కు అండగా ఉంటామని ఫ్రాన్స్ ప్రకటించింది. తమ నిఘా వ్యవస్థ అత్యున్నతమైనదని, తమ నిఘా సమాచారాన్ని ఉక్రెయిన్ ఉపయోగించుకోవచ్చని ఫ్రాన్స్ రక్షణ మత్రి సెబాస్టియన్ లెకార్ను వెల్లడించారు. అమెరికా సాయం నిలిచిపోవడంతో ఆ లోటును భర్తీ చేసేందుకు వివిధ రకాల ప్యాకేజీలను సత్వరమే ఉక్రెయిన్‌కు అందచేయవలసిందిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రాన్ తనను ఆదేశించినట్టు ఆయన చెప్పారు.
ఐరోపా దేశం తాము ఇబ్బందులతో సతమతమవుతున్న తరుణంలో అండగా ఉందని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ అన్నారు. ఐరోపా భద్రతా మండలి సదస్సుకు హాజరయ్యేందుకు బ్రసెల్స్ చేరుకున్న ఆయన విలేకరులతో మాట్లాడారు. తాము ఒంటరిగా లేమన్న భావనను ఐరోపా కలిగించిందని తెలిపారు. ఐరోపా నేతలకు ధన్యవాదాలు తెలిపారు. ఉక్రెయిన్‌లోని జెలెన్‌స్కీ స్వస్థలం క్రీవి రీహ్‌లోని ఓ హోటల్‌పై రష్యా బుధవారం రాత్రి క్షిపణిదాడి చేసింది. క్షిపణి దాడికి కొద్ది గంటల ముందు మానవతా సహాయక సంస్థ వలంటీర్లు ఆ హోటల్‌లో దిగారని జెలెన్‌స్కీ చెప్పారు. రష్యా దేశం ఇటీవల ఉక్రెయిన్‌లో పలు నగరాలపై క్షిపణిలతో పాటు డ్రోన్ ప్రయోగించింది. 112 షాహెడ్, డెకాయ్ డ్రోన్లను, రెండు బాలిస్టిక్ ఇస్కందర్ మిస్సైల్స్‌ను ప్రయోగించినట్టు ఉక్రెయిన్ వైమానికదళం ప్రకటించింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. ఆ హోటల్‌లో తమ దేశ పౌరులతో పాటు అమెరికా, బ్రిటన్ జాతీయులు ఉన్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వెల్లడించారు.
ఉక్రెయిన్‌కు అవసరమైన రక్షణ కల్పిస్తూనే తమ భద్రతను పెంపొందించుకునే లక్ష్యంతో చర్చలు ప్రారంభించినట్లు యురోపియన్ యూనియన్ (ఇయు) నేతలు తెలిపారు. బ్రస్సెల్స్‌లో ఇయు నేతలు అత్యవసర చర్చలు ప్రారంభించారు. తక్కువ సమయంలో యూరప్ దేశంలో రక్షణకు సంబంధించిన వాటిపై బలోపేతం చేసేలా చర్చలు కొనసాగాయి. ఇందులో భాగంగానే జరిగిన మీటింగ్‌లో ఈయూ సదస్సు చైర్మన్ ఆంటానియో కోస్టా, జర్మనీ నూతన ఛాన్స్ లర్‌గా నియామకమయ్యే ఫ్రెడరిక మెర్ట్ చర్చలు జరిపారు. అధికంగా రక్షణ వ్యయాన్ని అనుమతించాలంటే పెద్ద మొత్తంలో రుణాలు చేయాల్సి ఉందంటూ అందుకోసం దేశ నిబంధనలను సరళతరం చేసేందుకు కొన్ని ప్రణాళికలను మెర్జ్ ప్రతిపాదించారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన ఈ రెండు నెలల కాలంలో ప్రధానమైన మార్పు ఒకటి గోచరిస్తోంది. అమెరికా, యూరప్‌ల మధ్య సహకారాన్ని ఆయన ప్రశ్నిస్తున్నారు. అమెరికాలో కొత్తగా చోటుచేసుకున్న మార్పులకు అనుగుణంగా మరో యుద్ధం వస్తుంది అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో యూరప్ మరింత రక్షణ చర్యలకు చేపట్టాలని యూరోపియన్ పాలసీ సెంటర్ మేథోవర్గం ప్రకటించింది. నిర్ణయాత్మకమైన చర్యలతో యూరప్ ముందడుగు వేస్తుందని బుధవారం ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ మీడియాతో వ్యాఖ్యానించారు. సభ్య దేశాలు మిలటరీ సాయంను పెంచడంతో పాటు సంయుక్త నిధి ఏర్పాటు చేయనున్నాయి. అలాగే కొత్త ఆయుధాలు కొనడం, మరిన్ని తయారు చేయనున్నారు. ఉక్రెయిన్ అవసరాలను ఈ సమావేశం పరిష్కరించే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు.
ఉక్రెయిన్‌కు సైనిక సహాయాన్ని నిలిపివేసిన అమెరికా.. తాజాగా రష్యాకు సంబంధించిన నిఘా సమాచార మార్పిడిని కూడా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. రష్యాతో శాంతి చర్చలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై ఒత్తిడి తెచ్చేందుకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇంకోవైపు… రష్యా యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి అమెరికాకు వలస వచ్చిన దాదాపు 2,40,000 మంది ఉక్రేనియన్లకు ట్రంప్ యంత్రాంగం షాక్ ఇవ్వనుంది. వీరందరినీ అక్రమవలసదారులుగా ప్రకటించి.. ఏప్రిల్‌లో వారిని స్వదేశానికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ విషయాన్ని ట్రంప్ యంత్రాంగంలో సీనియర్లు ధ్రువీకరించారు.