Last Updated:

America Targets China: అమెరికా టార్గెట్ చైనానే.. అగ్రరాజ్య హోదాకు డ్రాగన్‌ ఎసరు?

America Targets China: అమెరికా టార్గెట్ చైనానే.. అగ్రరాజ్య హోదాకు డ్రాగన్‌ ఎసరు?

America Targets China ready for any type of war: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ యంత్రాంగం నిండా చైనా వ్యతిరేకులే ఉన్నారు. అగ్రరాజ్య హోదాకు డ్రాగన్‌ ఎసరు పెట్టకుండా చూడాలని, ముఖ్యంగా ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనాను కట్టడి చేయాలనే పట్టుదలతో వారు ఉన్నారు. అందుకు భారత్‌తో స్నేహహస్తాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నారు. అమెరికా చైనాను ఎలా కంట్రోల్ చేయాలని భావిస్తోంది. దానికి భారత్‌ను పావుగా వాడుకుంటుందా? లేక అమెరికానే ట్యాక్స్ రూపంలో చైనాను కట్టడి చేస్తుందా? దీనికి చైనా రియాక్షన్ ఏమిటి? ఎవరు ఎలా ముందుకు వెళ్లబోతున్నారో ఈ స్టోరీలో చూసేద్దాం..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ యంత్రాంగంలో ఎక్కువ శాతం చైనా వ్యతిరేకులే ఉన్నారు. అమెరికా అగ్రరాజ్య హోదాకు డ్రాగన్‌ ఎసరు పెట్టకుండా చూడాలని ప్లాన్ వేస్తున్నారు. దీనికోసం ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనాను కట్టడి చేయాలనే పట్టుదలతో ట్రంప్ యంత్రాంగం ఉన్నారు. ఇందుకోసం ఇండియాతో సంబంధాలు బలోపేతం చేయాలని చూస్తున్నారు.. నాటోతో పాటు మిత్రదేశాలైన జపాన్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియాలకు సమానమైన స్థాయిని ఇండియాకు కల్పించాలంటూ సెనేటర్‌ మార్క్‌ బిల్లును ప్రవేశపెట్టారు. పాకిస్థాన్‌కు భద్రతా పరమైన సాయమేదీ అందించకూడదనీ అందులో డిమాండ్‌ చేశారు సెనేటర్ మార్క్.

డొనాల్డ్‌ ట్రంప్‌ ఏరికోరి అమెరికా విదేశాంగ మంత్రిగా మార్క్‌ రూబియోను నియమించారు. ఆయన సెనేట్‌ సభ్యుడిగా ఉన్నప్పుడు బీజింగ్‌ను విమర్శించేందుకు అందివచ్చిన ఏ ఛాన్స్‌ను ఆయన వదిలిపెట్టేవారు కాదు. చైనాలో మానవ హక్కుల దుస్థితి, ఆ దేశం చేపట్టిన బెల్డ్‌ అండ్‌ రోడ్‌ ప్రాజెక్టువల్ల ఎదురయ్యే ప్రతికూల పరిస్థితుల గురించి రూబియో తరచూ ఏకరవు పెట్టేవారు. అది మింగుడుపడని బీజింగ్‌- తమ దేశంలోకి రాకుండా ఆయనపై ఆంక్షలు విధించింది. అమెరికా విదేశాంగ మంత్రిగా రూబియో నియామకంపై చైనా స్పందించలేదు సరికదా, ఆయనపై ఆంక్షల్ని ఎత్తివేసే విషయాన్ని ఇంతవరకు ప్రస్తావించనేలేదు. రూబియో పదవీ బాధ్యతలు స్వీకరిస్తూ- మనం పంథా మార్చుకోకుంటే భద్రత నుంచి వైద్యం వరకు అన్నింటా చైనా అనుమతితోనే మనుగడ సాగించాల్సి వస్తుందని హెచ్చరించారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారుగా నియమితులైన మైక్‌ వాల్ట్‌జ్‌దీ అలాంటి వైఖరే. చైనాను అతిపెద్ద శత్రువుగా, భారత్‌ను వ్యూహాత్మక భాగస్వామిగా మైక్ చెబుతారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో అమెరికా తన వ్యూహాన్ని కొనసాగిస్తుందని, అందులో భాగంగా చైనాను కట్టడి చేసేందుకు తైవాన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తుందని మైక్‌ పేర్కొన్నారు. చైనా, రష్యా, ఇరాన్‌ అంశాలు సహా ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాద సమస్యల పట్ల వాల్ట్‌జ్‌కు బాగా అవగాహన ఉందంటూ ట్రంప్‌ మెచ్చుకున్నారు.

ఇటీవల అమెరికా రక్షణ మంత్రిగా పీట్‌ హెగ్సెత్‌ నియమితులయ్యారు. కాగా, వారిదీ చైనా వ్యతిరేక వైఖరే. తమకు పోటీదారు చైనాయేననీ, తమ దేశాన్ని భయపెట్టగల సామర్థ్యం, అలాంటి ఉద్దేశం డ్రాగన్‌కు ఉన్నాయని పీట్ పలు సందర్భాల్లో తెలిపారు కూడాజ ఇండో-పసిఫిక్‌లో డ్రాగన్‌ దూకుడును కట్టడి చేసేందుకు అమెరికా ఇప్పటికే ప్లాన్ ఏ రెడీ చేసిందని అంటున్నారు. అమెరికా దీనికోసం మిత్రదేశాలూ, భాగస్వాములతో కలిసి పనిచేస్తామని హెగ్సెత్‌ అంటున్నారు. చైనాను కట్టడి చేసే దిశగా ఇండియా, అమెరికాలు సహకరించుకోవాలంటూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను అమెరికా రక్షణ మంత్రి హెగ్సెత్ కోరారు. ట్రంప్‌ బృందంలో కొత్తగా పాల్‌ కపూర్‌ తోడయ్యారు. అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా నియమితులైన ఆయనకు దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాలను అప్పగించారు. దక్షిణాసియా వ్యవహారాల నిర్వహణలో తప్పిదాలు చేసిన డొనాల్డ్‌ లూ స్థానంలో కపూర్‌ను నియమించారు. పాకిస్థాన్‌లో ఇమ్రాన్‌ ప్రభుత్వాన్ని కూల్చడంలోనూ, బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ మార్పులోనూ డేవిడ్‌లూ హస్తముందని అంతర్జాతీయ స్థాయిలో వినిపిస్తోంది. ఈ విషయాన్ని ఇమ్రాన్‌ ఖానే స్వయంగా తెలిపారు. భారత్‌-పాకిస్థాన్‌ భద్రతా వ్యవహారాల్లో, అణుసంబంధ విషయాల్లో నిపుణుడైన పాల్‌ కపూర్‌ ఇస్లామాబాద్‌కు బద్ధ వ్యతిరేకిగా ముద్రపడ్డారు.

అగ్రరాజ్యంగా తన స్థానానికి చైనా నుంచి ముప్పు పొంచి ఉందని వాషింగ్టన్‌ నమ్ముతోంది. దీంతో, ట్రంప్‌ ఉక్రెయిన్, గాజాల్లో యుద్ధాల నిలిపివేత ద్వారా తనస్థాయిని చూపించాలని తహతహ లాడుతున్నారు. తద్వారా అమెరికానే ఇంకా నెంబర్ వన్ అనే నమ్మకాన్ని కలిగించాలని చూస్తున్నాడు. ఉక్రెయిన్‌లో యుద్ధం ఆపటం కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడానని ట్రంప్‌ ప్రకటించారు. ఆ క్రమంలోనే ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతోనూ మీడియా ముందు హడావుడి చేయబోయాడు. కానీ, ఆ భేటీ అట్లర్ ఫ్లాప్ అయింది. పైగా నలుగురిలో రచ్చరచ్చ అయ్యింది. ట్రంప్‌ ఎలాగైనా పుతిన్‌తో నేర్పుగా మాట్లాడి ఒప్పందం కుదుర్చుతారని ఉక్రెయిన్‌ సహా ఐరోపా దేశాలు భయపడుతున్నాయి. ఉక్రెయిన్‌ సరిహద్దులు ఎప్పటికీ 2014కు ముందున్న స్థానానికి చేరే అవకాశం లేదని అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ ఆ దేశ మిత్రుల సమావేశంలో స్పష్టంచేశారు. నాటోలో ఉక్రెయిన్‌కు స్థానం ఉండబోదనీ తేల్చేశారు. ఇది రష్యాకు వీనులవిందే. ఉక్రెయిన్‌ తన భద్రతకు సంబంధించి అమెరికాను కోరగా.. అలాంటి బాధ్యతలు ఏం తీసుకోదని అమెరికా స్పష్టమవుతోంది. ఉక్రెయిన్‌లో ఐక్యరాజ్య సమితి దళాలను మోహరించాల్సిన పరిస్థితులు వస్తే యూరప్ దేశాలే తమ బలగాలను వాడాలి. అందులో అమెరికాకు ఎలాంటి ప్రమేయం ఉండదు. ఉక్రెయిన్‌పై జరిగే దాడులను నాటోపై దాడులుగా పరిగణించమని అమెరికా రక్షణ మంత్రి హెగ్సెత్‌ ఐరోపా దేశాలకు తెలిపారు. గాజా సంఘర్షణ విషయంలోనూ అగ్రరాజ్యం ఇదే పద్ధతిని అవలంబిస్తోంది. వివాదాన్ని ముగించేందుకు తాను సూచిస్తున్న షరతులకు అంగీకరించాలని ట్రంప్‌ అరబ్‌ దేశాలపై ఒత్తిడి తెస్తున్నారు. లేకుంటే సైనిక చర్యలు తప్పవని అరబ్ దేశాలను ట్రంప్ హెచ్చరిస్తున్నారు.

చైనాను కట్టడి చేసేందుకు అమెరికా- తన సైనిక శక్తిని మరింత శక్తివంతం చేసేందుకు ప్లాన్ వేస్తోంది. ఆగ్నేయాసియాలో చైనా ఏ మాత్రం పైచేయి సాధించినా అది అమెరికా స్థాయిని తగ్గిస్తుందని ట్రంప్‌ ఫీలవుతున్నారు. చైనా మాత్రం అమెరికాతో రాజీ కుదుర్చుకునే ప్రసక్తే లేదన్నట్లుగా దూకుడుగా వ్యవహరిస్తోంది. ట్రంప్‌ చైనాపై విధించిన ట్యాక్స్‌లకు సమాధానంగా అమెరికాతో ఆర్థిక యుద్ధానికి సిద్ధమైందే తప్ప, ఆ దేశంతో చర్చలకు చైనా ఆసక్తి చూపడం లేదు. పైగా ఈ వ్యవహారంలో చొరవ చూపే అవకాశాన్ని అమెరికాకే చైనా వదిలేసింది. ఇదిగాక అమెరికా తైవాన్‌ పట్ల అనుసరించే విధానం కూడా అయోమయంలో ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుని డ్రాగన్‌ తన అజెండాను నెరవేర్చుకునే ఛాన్స్‌ కూడా ఉంది. ఏది ఏమైనా ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో అమెరికా ప్రమేయాన్ని వీలైనంత మేర తగ్గించుకుని ఇండో-పసిఫిక్‌ రీజన్‌ మీద మొత్తం ఫోకస్ చేయాలని అమెరికా డిసైడ్ అయింది.

బెదిరింపులకు భయపడబోమని, అయినా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విధించిన అధిక టారిఫ్‌లు, ఇతర సవాళ్లను ఎదుర్కొనగలిగే సామర్ధ్యం తమ ఆర్థిక వ్యవస్థకు వుందని చైనా వాణిజ్య శాఖ మంత్రి వాంగ్‌ అంటున్నారు. వాణిజ్య యుద్ధంలో విజేతలు అంటూ ఎవరూ వుండరని వ్యాఖ్యానించారు. చైనా నేషనల్‌ కాంగ్రెస్‌ వార్షిక సమావేశం సందర్భంగా వాంగ్‌ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. చర్చలు జరిపేందుకు చైనా సిద్ధంగా వుందని పునరుద్ఘాటించారు. బెదిరింపులు, బలవంతపు చర్యలు అంతిమంగా విఫలమవుతాయని ఆయన తెలిపారు. చైనాపై ఇలాంటివి పనిచేయవని అన్నారు. తమను భయపెట్టలేరన్నారు. దేశ ప్రయోజనాలు కాపాడుకోవాలన్న చైనా కృతనిశ్చయం తిరుగులేనిదన్నారు. 140 దేశాలకు ప్రధాన వాణిజ్య భాగస్వామిగా చైనా వుందంటే తమకు అనేక అవకాశాలు వున్నాయని అర్థమని అన్నారు. తమ ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక మార్కెట్ల నిర్మాణానికి, బలోపేతానికి అనుసరించే వ్యూహాల గురించి ఆయన వివరించారు. జనవరి నుండి రెండుసార్లు చైనాపై ట్రంప్‌ ప్రభుత్వం టారిఫ్‌లు పెంచింది. చైనా కూడా ప్రతిగా అమెరికా ఉత్పత్తులపై, కంపెనీలపై ఇలాంటి ఆంక్షలు విధించింది. ఇతర దేశాలతో వ్యవహారాల్లో పరస్పర గౌరవం వుండాలని చైనా ఆకాంక్షిస్తుందన్నారు., అమెరికా ఈ తప్పుడు దారిలోనే ముందుకు సాగితే తాము కూడా అదే రీతిన ప్రతిస్పందిస్తామని, చివరికంటా పోరాడతామని చెప్పారు. వాణిజ్యంపై విభేదాలుంటే పరిష్కరించుకోవడానికి చైనా సిద్ధంగా వుందన్నారు. సాధ్యమైనంత త్వరలో సముచితమైన సమయంలో ఉభయ పక్షాలు సమావేశమై సమాచార మార్పిడి చేసుకోవాలన్నారు.