TG All Party MP Meeting: గోదావరి-బనకచర్లకు ఆనాడే అంకురార్పణ జరిగింది: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy All Party MP Meeting on Banakacharla Project: 2019 అక్టోబరులో కేసీఆర్, జగన్ ఇద్దరు కలిసి గోదావరి జలాలు రాయలసీమకు తరలింపుపై చర్చించుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు ఆనాడే అంకురార్పణ జరిగిందన్నారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు విషయంపై బుధవారం అఖిలపక్ష ఎంపీలతో సమావేశం జరిగింది. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు.
రాయలసీమకు గోదావరి జలాల తరలింపులో సహకరిస్తామని కేసీఆర్ అన్నట్లు ‘నమస్తే తెలంగాణ’లో రాశారని సీఎం తెలిపారు. రాజకీయాలు ఎలా ఉన్నా రైతుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బనకచర్ల వ్యవహారంపై ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపై విపక్షాలతో చర్చించినట్లు తెలిపారు. తెలంగాణకు గోదావరి, కృష్ణా నదులే జీవనాధారమన్నారు. తమ ప్రభుత్వానికి రైతుల ప్రయోజనాలే ముఖ్యమని పేర్కొన్నారు.
21-9-2016న కేంద్రం అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించిందని తెలిపారు. ఏటా మూడు వేల టీఎంసీల నీరు వృథాగా గోదావరి నీరు సముద్రంలో కలుస్తోందని అపెక్స్ కౌన్సిల్ భేటీలో కేసీఆర్ అన్నారని ఈ సందర్భంగా సీఎం గుర్తుచేశారు. మూడు వేల టీఎంసీలు వృథాగా పోతున్నాయని మొదట మాట్లాడింది కేసీఆరే అన్నారు. అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఎవరు ఏం మాట్లాడారో అంతా దస్త్రాల రూపంలో ఉందని చెప్పారు. రాయలసీమకు గోదావరి జలాల తరలింపుపై చర్చించుకున్నామని ఆనాడు తెలంగాణ, ఏపీ మంత్రులు మీడియాకు చెప్పారన్నారు.
గోదావరి-బనకచర్లపై అవసరం అయితే సుప్రీం కోర్టుకైనా వెళ్లాలని భావిస్తున్నామని, నీటి ఒప్పందాలపై నిపుణులైన న్యాయవాదులను నియమించుకుంటామన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునేందకు అన్ని ప్రయత్నాలు చేస్తామని స్పష్టం చేశారు. గోదావరి-బనకచర్లను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని నిర్ణయించినట్లు తెలిపారు. అన్ని పార్టీలను కలుపుకొని పోరాడుతామన్నారు. తెలంగాణకు కృష్ణా నీటిలో 299 టీఎంసీలు సరిపోతాయని ఆనాడు కేసీఆర్ ఒప్పుకొని సంతకం చేశారని, కేసీఆర్ చేసిన సంతకం ఇవాళ రాష్ట్రానికి ప్రతిబంధకంగా మారిందన్నారు.
సీఎం వ్యాఖ్యలు ఖండించిన బీఆర్ఎస్ ఎంపీ..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అభ్యంతరం తెలిపారు. ఆనాడు తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ మాట్లాడారని వివరణ ఇచ్చారు. కృష్ణానదిని కలుపుతూ గోదావరి జలాలు తీసుకెళ్తే అభ్యంతరం లేదని కేసీఆర్ అన్నారని గుర్తుచేశారు. సమావేశం పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో జరుగుతోందని మండిపడ్డారు.