USA : యూఎస్‌లో వలసదారుల వేట.. ఒకేరోజు 3వేల మంది అరెస్టు
USA : రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా తమ దేశంలో ఉన్న వలసదారులను స్వదేశానికి తిరిగి పంపారు. అమెరికాలో రికార్డు స్థాయిలో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఒకేరోజు ఐసీఈ అధికారులు 3వేల మందిని అరెస్టు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ట్రంప్ సహాయకులు స్టీఫెన్ మిల్లర్, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టి నియోమ్ ఇటీవల ఐసీఈ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. రోజుకు 3వేల మంది వలసదారులను అరెస్టు చేయాలని చెప్పారు. మంగళవారం ఒక్కరోజే 2,200 మందిని అదుపులోకి తీసుకున్నారని ఎన్‌బీసీ న్యూస్ పేర్కొంది. బుధవారం 3వేల మందిని అరెస్టు చేశారు. ఐసీఈ డిపార్ట్‌మెంట్ చరిత్రలోనే ఓ రికార్డు.
ఉన్నతాధికారులు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసేందుకు ఐసీఈ అధికారులు ఏటీడీ ప్రోగ్రాం కింద నమోదు చేసుకున్న వారిని లక్ష్యంగా చేసుకొన్నట్లు తెలుస్తోంది. పత్రాలు లేకుండా యూఎస్‌లో ప్రవేశించిన వ్యక్తుల కారణంగా సమాజానికి ఎలాంటి ముప్పు లేకపోతే వారిని యాంకిల్ మానిటర్లు, స్మార్ట్‌ఫోన్ యాప్‌లు, ఇతర జియోలొకేషన్ పరికరాలతో గమనిస్తుంటారు. వారు తరచూ ఐసీఈ కేంద్రాల్లో హాజరు కావాల్సి ఉంటుంది.
ప్రస్తుతం అధికారులు ఏటీడీలో నమోదైన వలసదారులను ఐసీఈ కార్యాలయంలో హాజరుకావాలని సందేశాలు పంపిస్తున్నారు. వారు రాగానే అరెస్టు చేస్తున్నారు. వీరికి బేడీలు వేసి కార్లలో తరలిస్తున్నారు. హాజరయ్యేవారిలో చాలామంది అధికారులు నిర్దేశించినప్పుడల్లా గడువు తప్పకుండా ఐసీఈ కేంద్రాల్లో హాజరైన వారున్నారు. గతంలో ఐసీఈ పిలుపు వచ్చినా హాజరుకాని వారుంటే మాత్రం అలాంటివారు డిపోర్టేషన్ ముప్పును ఎదుర్కొంటున్నారు. ఐసీఈ ప్రతినిధి మాట్లాడుతూ తాజాగా తాము అరెస్టు చేసిన వారిని ఈ ప్రోగ్రాం నుంచి తొలగించాలని ఇమిగ్రేషన్ జడ్జి గతంలో ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు వాటిని అమలుచేస్తున్నామని పేర్కొన్నారు.
గతంలో ట్రంప్ మిలియన్ల కొద్దీ వలసదారులను వెనక్కి పంపిచేస్తానని హామీనిచ్చారు. కానీ, లక్ష్యాన్ని చేరుకోవడం ఐసీఈకి సాధ్యం కాదని సంస్థ మాజీ అధికారి పేర్కొన్నారు. గణాంకాల ప్రకారం సంస్థ ప్రస్తుతం 20వేల యాంకిల్ మానిటర్లను వినియోగిస్తోంది. యాంకిల్ మానిటర్లను ధరించిన వారు అధికారుల ఎదుట హాజరైనప్పుడు అరెస్టులు చేస్తున్నారు. ఈ చర్యలతో పత్రాలు లేకుండా వచ్చిన చాలామంది వలసదారుల్లో భయం రేకెత్తుతోంది.