Iran – Israel War Update: ఇరాన్‌లోని 1100 లక్ష్యాలను ధ్వంసం చేశాం : ఇజ్రాయెల్ సాయుధ దళాల ప్రకటన
Iran – Israel War Update: ఇరాన్ నుంచి అణు ముప్పును తాము ఒక వ్యూహం ప్రకారం అణచివేస్తున్నామని ఇజ్రాయెల్ సాయుధ దళాలు తెలిపాయి. ఇప్పటికే తమ ఎయిర్‌ఫోర్స్ ఇరాన్‌లోని 1100 లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు ఐడీఎఫ్ ప్రతినిధి, బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డెఫ్రిన్ వెల్లడించారు.
తాము ఒక పద్ధతి ప్రకారం ఇరాన్‌లోని అణుముప్పును నాశనం చేస్తున్నామని తెలిపాయి. తమ దాడులు వారి నష్టాన్ని గణనీయంగా పెంచుతున్నాయని, ఫలితంగా వారి బాలిస్టిక్ క్షిపణులు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు దెబ్బతింటున్నాయని డెఫ్రిన్ పేర్కొన్నారు. దాడులకు సంబంధించిన వీడియోలను ఇజ్రాయెల్ దళాలు షేర్ చేశాయి. ఇజ్రాయెల్ వాయుసేనకు చెందిన విమానాలు గత శుక్రవారం నుంచి ఇరాన్‌పై దాడులు చేస్తున్నాయి. పశ్చిమ ఇరాన్, టెహ్రాన్ గగనతలంపై తాము పూర్తిగా పట్టు సాధించినట్లు చెబుతున్నాయి. ఇప్పటివరకు 70 ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ బ్యాటరీలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ చెబుతోంది.
ఇదిలా ఉంటే.. ఇజ్రాయెల్‌కు చెందిన ఓ భారీ డ్రోన్‌ను కూల్చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇజ్రాయెల్ కూడా ధ్రువీకరించింది. తమ మానవరహిత విమానాన్ని ఇరాన్ ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణిని వాడి ధ్వంసం చేసిందని పేర్కొంది.