Last Updated:

UK Government: బీబీసీకి మద్దతు ఇస్తున్నాం: బ్రిటన్ ప్రభుత్వం స్పష్టం

ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో జరిగిన గోద్రా అల్లర్ల వెనుక.. ఆయన హస్తం ఉందంటూ బీబీసీ రూపొందించిన ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’డాక్యుమెంటరీని ప్రసారం చేసింది.

UK Government: బీబీసీకి మద్దతు ఇస్తున్నాం: బ్రిటన్ ప్రభుత్వం స్పష్టం

UK Government: ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో జరిగిన గోద్రా అల్లర్ల వెనుక.. ఆయన హస్తం ఉందంటూ బీబీసీ రూపొందించిన ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ డాక్యుమెంటరీని ప్రసారం చేసింది.

అయితే, గుజరాత్ మారణకాండకు సంబంధించి మోదీకి సుప్రీంకోర్టులో క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత ఇలా వివాదాస్పద డాక్యుమెంటరీ విడుదలపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.

దీంతో డాక్యుమెంటరీకి సంబంధించిన లింకులన్నింటినీ కేంద్ర ప్రభుత్వం నిషేధించింది.

ఈ ఘటన జరిగిన రెండు వారాల తర్వాత నాటకీయంగా బ్రిటీష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) పై ఐటీ అధికారులు ‘సర్వే’ పేరుతో సోదాలు నిర్వహించారు.

బీబీసీ పన్ను ఎగివేతకు పాల్పడుతోందన్న అనుమానంతో మూడు రోజుల పాటు ఈ సర్వే నిర్వహించారు.

ఈ సోదాల్లో కీలక డాక్యుమెంట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.

 

మీడియాకు  స్వేచ్ఛ ముఖ్యం: బ్రిటన్(UK Government)

అయితే, తాజా ఈ అంశంపై బ్రిటన్ ప్రభుత్వం స్పందించింది. ఈ ఘటనలో బీబీసీని బ్రిటన్ సమర్థించింది.

మీడియా సంస్థలకు స్వేచ్ఛ ముఖ్యమని తెలిపింది. ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్ర్యం, పత్రికా స్వేచ్ఛ అవరసరమని పేర్కొంది.

యూకే పార్లమెంట్ లో హౌస్ ఆఫ్ కామన్స్ లో లేవనెత్తిన ప్రశ్నకు విదేశాంగ కామన్వెల్త్ కార్యాలయం జూనియర్ మంత్రి డేవిడ్ రూట్లీ పై వ్యాఖ్యలు చేశారు.

అయితే బీబీసీ పై ఐటీ అధికారులు చేసిన ఆరోపణలను భారత ప్రభుత్వంతో ముడిపెట్టలేమని తెలిపారు.

ఈ క్రమంలో భారత్ తో ఉన్న లోతైన సంబంధాల గురించి ఆయన ప్రస్తావించారు.

భారత్ తో ఉన్న అనేక సమస్యలను నిర్మాణాత్మక పద్దతిలో చర్చించేందుకు బ్రిటన్ ప్రభుత్వానికి వీలుందని చెప్పారు.

 

మొత్తం 12 భాషల్లో సేవలు

కాగా, బీబీసీ కి మద్దతుగా నిలుస్తామని .. తమ దృష్టిలో బీబీసీ వరల్డ్ సర్వీస్ విశిష్టమైందని ఆయన స్పష్టం చేశారు.

బీబీసీ సంస్థకు నిధులిస్తున్నామని.. సంపాదకీయ స్వేచ్ఛ, రోజూవారీ కార్యకలాపాల్లో స్వతంత్రత ఉండాలని కోరుకుంటున్నట్టు ఆయన తెలిపారు.

బీబీసీ బ్రిటీష్ ప్రభుత్వాన్ని, ప్రతిపక్ష లేబర్ పార్టీని కూడా విమర్శిస్తుందని.. ఆ సంస్థకు ఆ స్వేచ్ఛ ఉందన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ స్నేహితులకు అంటే భారత్ తో సహా బీబీసీ ప్రాముఖ్యతను తెలియజేయగలిగారన్నారు.

ఈ పబ్లిక్‌ బ్రాడ్‌ కాస్టర్‌ కీలక పాత్ర పోషించడమే గాక నాలుగు ఇండియన్ భాషలతో సహా మొత్తం 12 భాషల్లో సేవలు అందిస్తుందన్నారు.

ఎందుకంటే ఇది తమ స్వరం మాత్రమే గాదు బీబీసీ ద్వారా బ్రిటన్ స్వతంత్ర స్వరాన్ని ప్రపంచవ్యాప్తంగా వినిపించేలా చూసుకోవడం అతి ముఖ్యమని చెప్పారు.