Published On:

Donald Trump : ఇరాన్‌తో అణ్వాయుధాల ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నం

Donald Trump : ఇరాన్‌తో అణ్వాయుధాల ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నం

Donald Trump : ఒకవైపు ఇరాన్‌తో అణ్వాయుధాల అంశంలో ఒప్పందం కుదుర్చుకోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాగా, మరోవైపు ఇరాన్‌లోని అణు కేంద్రాలపై దాడులు చేయడానికి ఇజ్రాయెల్ పక్కాగా ప్రణాళికలు తయారు చేస్తోంది. ఇజ్రాయెల్ పన్నాగాలను అమెరికా అధికారులు పసిగట్టారు.

 

అణ్వాయుధాల తయారీకి ఇరాన్, అగ్రరాజ్యం దేశాల మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. అణ్వాయుధాలు అభివృద్ధి చేసుకోవడానికి సంబంధించి ఇరాన్ తో ఒప్పందం కుదుర్చుకోవడానికి అమెరికా చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. అయితే ఈ విషయంలో్ ఇరాన్ సానుకూలంగా స్పందించడం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇరాన్, అమెరికా మధ్య ప్రతిష్టంభన నెలకొన్న వాతావరణం కనిపిస్తోంది.

 

ఇదిలా ఉంటే ఇరాన్ లోని అణు కేంద్రాలపై దాడులు చేయడానికి ఇజ్రాయెల్ సన్నద్ధమతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు ఇజ్రాయెల్ పక్కా ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం అందింది. అయితే ఇజ్రాయెల్ వ్యూహాలను అమెరికా సైనికాధికారులు పసిగట్టారు. అయితే ఇరాన్ లోని అణు కేంద్రాలపై దాడులు చేయడానికి ఇజ్రాయెల్ సైన్యానికి ప్రధాని నెతన్యాహు ఆమోదం తెలియచేశారా లేదా అనేది తెలియరాలేదు. ఒక వేళ నెతన్యాహు ఆమోదం తెలియచేస్తే, ఈ విషయాన్ని అమెరికా తీవ్రంగా పరిగణించే అవకాశాలున్నాయి. ప్రధానంగా ఇరాన్ తో ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలు దెబ్బతింటాయని అమెరికా భావించవచ్చు. సాధ్యమైనంత వరకు నయానో, భయానో ఇరాన్ అణ్వాయుధాలకు సంబంధించి తమతో ఒప్పందం చేసుకోవాలని అమెరికా భావిస్తోంది. మొదట్లో కాస్తంత మొండికేసినా, చివరకు ఇరాన్ దారి కొస్తుందని ట్రంప్ సర్కార్ ధీమా వ్యక్తం చేస్తోంది. కాగా ఇజ్రాయెల్ దాడుల ప్రణాళికల గురించి నెతన్యాహూ కార్యాలయం కానీ, వాషింగ్టన్ లోని ఇజ్రాయెల్ కార్యాలయం కానీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో అమెరికా, వేచి చూసే మూడ్‌లో ఉంది.

 

ఇదిలా ఉంటే, అణ్వాయుధాలను తాము అభివృద్ది చేసుకుని తీరుతామని ఇరాన్ సుప్రీం లీడర్ ఆయెతుల్లా ఖమేనీ స్పష్టం చేశారు.దీనికి అమెరికా అనుమతులు తీసుకోవాల్సిన అవసరం తమకు లేదని ఆయెతుల్లా ఖమేనీ పేర్కొన్నారు. యురేనియం శుద్ధిపై అమెరికా పరిమితులు విధించడాన్ని ఆయన తప్పుపట్టారు. అణ్వాయుధాల కార్యక్రమాలకు సంబంధించి ఇరాన్ కు తనకంటూ స్వంత విధానాలు ఉన్నాయని ఖమేనీ పేర్కొన్నారు. ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ఖమేనీ పేర్కొన్నారు. ఎవరైనా అనవసరంగా జోక్యం చేసుకుంటే తాము సహించేది లేదని కుండబద్దలు కొట్టారు ఆయెతుల్లా ఖమేనీ.

 

గతంలో ఇరాన్ అధ్యక్షుడిగా ఇబ్రహీం రైసీ ఉన్న సమయంలో అణ్వాయుధాలకు సంబంధించి ఇరాన్, అమెరికా మధ్య చర్చలు జరిగాయి. అవి పరోక్ష చర్చలు. ఈసారి ఇదే అంశంపై ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకోవడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇరాన్ అణ్వాయుధాలు అభివృద్ధి చేసుకోకుండా నిలువరించడమే ట్రంప్ పనిగా పెట్టుకున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా ఇరాన్, అమెరికాకు చెందిన ఉన్నతాధికారులు ఇటీవల అనేక విడతలుగా చర్చలు జరిపారు.

 

ఇప్పటికి మూడు విడతలుగా ఇరాన్, అమెరికా మధ్య చర్చలు జరిగాయి. అయితే మూడో విడత చర్చల్లో యురేనియం శుద్ధి అంశమే కీలకంగా మారింది. పౌర అవసరాలకు మాత్రమే యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని ఇరాన్ పరిమితం చేయాలని అమెరికా పట్టుబడుతోంది. అంతేకానీ , అణ్వాయుధాలు తయారు చేసే స్థాయిలో యురేనియం శుద్ధి కార్యక్రమం ఉండకూడదని ట్రంప్ సర్కార్ భావిస్తోంది. ఇందులో భాగంగా ఇరాన్ తో ఒప్పందం వైపు అమెరికా అడుగులు వేస్తోంది. కాగా తాజా పరిణామాలపై ఇరాన్ సుప్రీం లీడర్ ఆయెతుల్లా ఖమేనీ స్పందించారు. అమెరికాతో తదుపరి చర్చలు ఎప్పుడు ఉంటాయనే విషయమై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో అమెరికా విధానాలను ఇరాన్ నిశితంగా గమనిస్తోందని ఖమేనీ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: