Donald Trump: యూఎస్ ఎయిడ్‌పై ట్రంప్ కామెంట్స్.. రూ. 181 కోట్ల మేర పంపారని అక్కసు

Donald Trump claims USAID funding in India: భారత్‌లో ఓటింగ్‌ను మరింత పెంచటానికి యూఎస్ ఎయిడ్ పేరిట అమెరికా ప్రభుత్వం అందజేసే రూ. 181 కోట్ల మొత్తాన్ని ఇకపై నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రకటించారు. ఈ విషయాన్ని ఇటీవల ట్రంప్ యంత్రాంగంలో కీలక పాత్ర పోషిస్తున్న మస్క్ నేతృత్వంలోని డోజ్ విభాగం ఫిబ్రవరి 16న ప్రకటించగా, ట్రంప్ దీనిపై మరోసారి స్పందించారు. గత బైడెన్ ప్రభుత్వం ఇలాంటి అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకుందని అధ్యక్షుడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
ఎవరో మరి?
భారత్‌లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు నిధులు అందించటం ద్వారా గత అధ్యక్షుడు భారత్‌లో ‘మరొకరి’గెలుపు కోసం పనిచేశారంటూ ట్రంప్.. బైడెన్ మీద ఫైర్ అయ్యారు. తాజాగా, మియామిలో నిర్వహించిన ఎఫ్ఐఐ ప్రియారిటీ సదస్సులో ట్రంప్ దీనిపై మాట్లాడుతూ.. భారత్‌లో ఓటింగ్ పెంచటం కోసం.. అమెరికా తన నిధులను ఎందుకు ఖర్చు పెట్టాలో తనకు ఇంకా అర్థంకావటం లేదని అన్నారు. చూడబోతే.. ఆ దేశంలో తనకు ఇష్టమైన మరెవరినో గెలిపించటానికి బైడెన్ పూనుకున్నారని అనిపిస్తోందని ట్రంప్ అనుమానం వ్యక్తం చేశారు. ఇది భారత ఎన్నికల వ్యవస్థలో వేలు పెట్టటం తప్ప మరొకటి కాదని, ఈ విషయాన్ని భారత ప్రభుత్వానికి తప్పనిసరిగా తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.
వాళ్లకేం తక్కువట?
కాగా, నిధుల నిలిపివేత అంశంపై అంతకుముందు ఫ్లోరిడాలోని తన నివాసమైన మార్ ఎ లాగోలో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. భారత్ వద్ద బోలెండంత సంపద ఉందని, కనుక ఇంకా వారి ఎన్నికల కోసం మనం ఖర్చు పెట్టాల్సిన పనేం లేదని ట్రంప్ తేల్చి పారేశారు. ప్రపంచంలోనే అత్యధికంగా సుంకాలు విధించే దేశాలలో భారత్ ఒకటని, ఆ రేంజ్‌లో సుంకాలు వేయటం తమ దేశానికి ఎన్నటికీ చేతకాదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘అంత బాగున్న ఇండియా ఎన్నికలకు మన సొమ్ము తగలేయటమేంటి? మరి.. అమెరికా ఓటర్ల కోసం మనం ఏం చేశాం? అని అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్, నేపాల్ కు కేటాయించిన ఎన్నికల ఫండ్‌నూ క్యాన్సిల్ చేశారు.
బీజేపీ స్పందన..
కాగా, ట్రంప్ ప్రకటనపై బీజేపీ అధికార ప్రతినిధి అమిత్ మాలవీయ స్పందించారు. ‘ఈ అమెరికా నిధుల వల్ల ఎవరికి ఏం మేలు జరిగిందో గానీ.. మాకు మాత్రం పావలా ప్రయోజనం లేదు’ అని వ్యాఖ్యానించారు. ఈ చర్య భారత ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడమే అవుతుందని ట్రంప్ చెప్పారని, భారతీయ వ్యవస్థలో విదేశీ సంస్థలు వ్యవస్థీకృతంగా చొరబాటుకు యత్నిస్తున్నాయంటూ ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ విదేశీ బంధాలు బయటపడుతున్నాయంటూ దుయ్యబట్టారు. ఈ ఆరోపణలను కాంగ్రెస్ నేతలు తోసిపుచ్చారు.
టెస్లా, ఉక్రెయిన్‌పై కామెంట్స్
భారత్‌లో టెస్లా ఎలక్ట్రానిక్ కార్ల ఫ్యాక్టరీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేయటంపైనా ట్రంప్ స్పందించారు. ఎలాన్ మస్క్, ట్రంప్ ఇద్దరూ కలిసి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అధ్యక్షుడు మాట్లాడుతూ, ప్రతి దేశమూ అమెరికా మీద సుంకాలు వేసి లబ్ది పొందుతోందని, ఈ నిర్ణయం.. వ్యాపారపరంగా మస్క్‌కు లాభదాయమే కావచ్చు గానీ, దేశంగా అమెరికాకు మాత్రం నష్టమేనని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ.. నియంతగా వ్యవహరిస్తూ పరిస్థితిని మరింత దిగజార్చుతున్నారని, ఇకనైనా ఆయన తన తీరు మార్చుకోవాలని ట్రంప్ సూచించారు.