Puri Jagannadh Rath Yathra: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జగన్నాథ రథయాత్ర

Puri Jagannadh Rath Yathra2025: హైదరాబాద్ కూకట్ పల్లిలోని ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో జగన్నాథ స్వామి రథయాత్ర ఘనంగా నిర్వహించారు. హైదర్ నగర్ నుండి ప్రారంభమైన స్వామి రథయాత్ర నిజాంపేట్, జేఎన్టీయూ, కేపి.హెచ్.బి, కూకట్ పల్లి వై జంక్షన్ వరకు శోభాయ మానంగా సాగింది. భక్తులు స్వామివారి రథాన్ని లాగేందుకు పోటీపడ్డారు. భక్తులు ఇస్కాన్ స్వామి వారి పాటలకు నృత్యాలు చేస్తూ అందరిని ఆకట్టుకున్నారు. ట్రాఫిక్‌కు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రథయాత్ర సాఫీగా జరిగేలా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ రథయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఇస్కాన్ నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
హైదరాబాద్‌లోని సికింద్రాబాద్‌లో సంగీత్ సర్కిల్ వద్ద ఇస్కాన్ టెంపుల్‌లో జగన్నాధ రథయాత్రను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. అనంతరం నిర్వాహకులు ఆయనను సన్మానించారు. జగన్నాథ రథయాత్ర వందలాది మంది భక్తుల మధ్య కొనసాగింది. స్వామివారి రథాన్ని లాగేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటీపడ్డారు. జగన్నాథుడు ఆశీస్సులతో అందరూ సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు.
ఏలూరు జిల్లా లక్ష్మీపురంలో శ్రీవెంకటేశ్వరస్వామి ఉప ఆలయమైన శ్రీ సంతాన గోపాల జగన్నాథ స్వామివారి ఆలయంలో రథయాత్ర మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు నుంచి వచ్చేనెల 6వ తేదీ వరకు పదిరోజుల పాటు మహోత్సవాలు జరగనున్నాయి. మహోత్సవాల సందర్భంగా మెుదటిరోజు మత్స్యావతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. కాసేపట్లో స్వామివారికి ఊరేగించనున్నారు. ఊరేగింపు సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
ఒడిశాలలోని పూరీ జగన్నాథుని రథయాత్ర జరిగింది.ఈ రథయాత్రలో నందిఘోష్, తాళధ్వజ, దర్పదళన్ రథాలను సుందరంగా అలంకరించారు. జగన్నాథుడుని బలభద్రుడు, సుభద్ర దేవి రథాలపై గుండిచాదేవి ఆలయం వరకు ఊరేగించారు. ఈ ఏడాది యాత్రను వీక్షించేందుకు12 లక్షల మందికి పైగా భక్తులు వచ్చినట్లునిర్వహకులు తెలిపారు. భారీగా జనం తరలిరావడంతో అధికారులు 10 వేల మంది పోలీసులతో మోహరించారు. 2 వందల 75 ఏఐ కెమెరాలు, డ్రోన్ల సాయంతో ప్రత్యేక నిఘా ఉంచారు.