Last Updated:

Asteroid: దూసుకొస్తున్న గ్రహశకలం.. భూమిని ఢీకొంటే భారీ ఉత్పాతమే!

Asteroid: దూసుకొస్తున్న గ్రహశకలం.. భూమిని ఢీకొంటే భారీ ఉత్పాతమే!

Asteroid 2024 YR4’s chances of hitting Earth in 2032: అంతరిక్షంలో ఒక భారీ గ్రహశకలం భూమి వైపు దూసుకువస్తోందని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. 2023 డిసెంబర్‌లోనే ఆ గ్రహ శకలాన్ని గుర్తించామని, దానిని 2024 వైఆర్4గా వ్యవహరిస్తున్నామని వారు తెలిపారు. ఆ గ్రహశకలం భూమిని తాకే అవకాశం కేవలం ఒక శాతం ఉందని తొలుత అంచనా వేసిన శాస్త్రవేత్తలు తాజాగా ఆ ముప్పు రోజురోజుకూ పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 40 మీటర్ల నుంచి 90 మీటర్ల పరిమాణంలో ఉన్న ఆ ఆస్టరాయిడ్ 2032 డిసెంబర్ 22న భూమిని తాకవచ్చునని వారు సూచిస్తున్నారు.

గంటకు 40 వేల మైళ్ల వేగంతో..
ఈ ఏడాది జనవరి 29న మరొకసారి 2024 వైఆర్4 కదలికలను పరిశీలించగా భూమిని తాకే ప్రమాదం కేవలం ఒక శాతం ఉన్నట్లు తేలిందని వారు చెబుతున్నారు. అయితే, ఈ నెలలో జరిపిన పరిశోధనలో ఆ ముప్పు 3.2 శాతానికి పెరిగిందని వారు తెలిపారు. భారీ పరిమాణంలో ఉన్న ఆ గ్రహశకలం దాదాపు గంటకు 40 వేల మైళ్ల వేగంతో భూమి వైపుయ దూసుకువస్తోందని నాసా శాస్త్రవేత్తలు తెలియజేశారు. ఒక వేళ ఆ గ్రహశకలం భూమిని ఢీకొనకపోయినా, వాతావరణంలోకి ప్రవేశించిన తరువాత పేలిపోయినా ప్రభావం భారీగానే ఉంటుందని వారు సూచించారు. హిరోషిమాపై వేసిన అణుబాంబుతో పోలిస్తే 500 రెట్లు అధిక ప్రభావం ఉంటుందని వారు అంచనా వేశారు.

మధ్యలోనే పేల్చేయొచ్చు
గ్రహశకలం మార్గాన్ని పరిశీలించగా, అది నేరుగా పసిఫిక్ సముద్రంలో లేదా నార్తరన్ సౌత్ అమెరికా, అట్లాంటిక్ సముద్రం, ఆఫ్రియా, అరేబియన్ సముద్రం, దక్షిణాసియాలలో ఏదో ఒక చోట పడుతుందని గుర్తించినట్లు నాసా శాస్త్రవేత్తలు తెలియజేశారు. ఇక ఆ 2024 వైఆర్ 4 గ్రహశకలం భూమిని తాకు ముప్పు ప్రస్తుతానికి 2.8 శాతం ఉందని యూరో స్పేస్ ఏజెన్సీ వెల్లడించింది. ఆ గ్రహశకలం భూమిని తాకుతుందా లేదా గాలిలోనే పేలిపోతుందా అనే విషయమై స్పష్టత లేదని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. అవసరమైతే గ్రహశకలాన్ని అడ్డుకుని మధ్యలోనే పేల్చివేసేందుకు తగిన సమయం ఉందని వారు చెప్పారు. 2022లో నాసా అభివృద్ధి చేసిన డిమాన్‌స్ట్రేటెడ్ ఆస్టరాయిడ్ డిఫ్లెక్షన్ టెక్నాలజీ (డార్ట్)తో ఆ గ్రహశకలాన్ని దారి మళ్లించవచ్చునని కూడా వారు సూచించారు.