England Vs India: ఇంగ్లాండ్‌తో భారత్ తొలి టెస్ట్.. గెలిచేదెవరో..?

India set 371 run target before England in 1st test match: భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. లీడ్స్ వేదికగా హెడింగ్లీ స్టేడియంలో ఇరు జట్లు తొలి టెస్ట్ గెలిచేందుకు పోరాడుతున్నాయి. అయితే ఈ టెస్ట్ విజేత ఎవరనే విషయం నేడు తేలిపోనుంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ ముందు భారత్ 371 పరుగుల లక్ష్యం ఉంచింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ బ్యాటర్లలో జాక్ క్రాలే(12), బెన్ డకెట్(9) పరుగులతో క్రీజులో ఉన్నారు.
అంతకుముందు, 2 వికెట్లను కోల్పోయి 90 పరుగులతో భారత్ మూడో రోజు ఆట ప్రారంభించగా.. మిగతా 8 వికెట్లు కోల్పోయి 364 పరుగులు చేసింది. ఓపెనర్ రాహుల్ (137), వైస్ కెప్టెన్ రిషభ్ పంత్(118) పరుగులు చేశారు. సాయిసుదర్శన్(30), కెప్టెన్ గిల్(8), కరుణ్ నాయర్(20), రవీంద్ర జడేజా(25) పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో కార్స్, జోష్ టంగ్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. బషీర్ 2 వికెట్లు, వోక్స్, స్టోక్స్ తలో వికెట్ తీశారు.
ఇదిలా ఉండగా, ఈ మ్యాచ్ గెలిచేందుకు ఇరు జట్లకు సమాన అవకాశాలు ఉన్నాయి. దీంతో ఇవాళ చివరిరోజు మ్యాచ్ ఆసక్తికరంగా సాగనుంది. భారత్ గెలవాలంటే తప్పనిసరిగా ఇంగ్లాండ్ జట్టును ఆలౌట్ చేయాలి. ఇంగ్లాండ్ విజయానికి ఇంకా 350 పరుగులు కావాలి. ఇంగ్లాండ్‌కు బ్యాటింగ్‌లో పోప్, రూట్, స్టోక్స్ కీలకం కానుండగా.. భారత్ బౌలర్లలో బుమ్రా కీలకం కానున్నారు. బుమ్రాకు ప్రసిద్ధ్, సిరాజ్ సపోర్టు ఇస్తే భారత్ గెలిచేందుకు అవకాశం ఉంది.