Anaganaga OTT Release: నేరుగా ఓటీటీలోకి సుమంత్ అనగనగా చిత్రం – స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే!

Sumanth Anaganaga Direct Release in OTT: ఈ మధ్య అక్కినేని హీరోలకు పెద్దగా కలిసిరావడం లేదనే చెప్పాలి. గత కొంతకాలంగా ఈ హీరో సినిమాలు బాక్సాఫీసు వద్ద నిరాశపరుస్తున్నాయి. వరుస ప్లాప్స్ తర్వాత నాగ చైతన్యకు బ్లాక్‌బస్టర్ హిట్ పడింది. ఇక అఖిల్‌కి ఇప్పటి వరకు చెప్పుకొదగ్గ హిట్ లేదు. నాగార్జున ప్రస్తుతం లీడ్ రోల్స్ ఆపేసి అతిథి పాత్రలకే మొగ్గు చూపుతున్నారు. ఇక సుమంత్ విషయానికి వస్తే.. అతడు తెరపై కనిపించి చాలా కాలం అయ్యింది.
ఒకప్పుడు లవ్‌స్టోరీలు, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతకాదు హిట్స్, సూపర్ హిట్స్‌ని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే కొంతకాలంగా అతడు నటించిన సినిమాలన్ని ఆశించిన విజయం అందుకోలేకపోతున్నాయి. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో అలరించిన సుమంత్ కొంతకాలం నటనను పక్కన పెట్టాడు. ఇక లాంగ్ గ్యాప్ తర్వాత ఆయన ప్రధాన పాత్రలో అనగనగ అనే మూవీ తెరకెక్కింది. సన్నీ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్ చౌదరి హీరోయిన్‌గా నటించింది. థియేటర్లలోకి వస్తుందనుకున్న ఈ సినిమా నేరుగా ఓటీటీలో విడుదల కానుంది.
తాజాగా దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈటీవీ విన్‌లో మే 8న ఈ మూవీ నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. “పరీక్షల ఒత్తిడి ఎదుర్కొంటున్నారా?.. చిల్ అవ్వండి.. స్మైల్ ఇవ్వండి. స్మార్ట్‌గా రివైజ్ చేయండి. బాగా నిద్రపోండి. మీపై మీరు నమ్మకం ఉంచండి. అనగనగా ఓ విన్ ఒరిజినల్ మూవీ.. మే 8 నుంచి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది” అనే అంటూ దీనిపై సదరు సంస్థ ప్రకటన ఇచ్చింది. కాగా ప్రస్తుతం విద్యాసంస్థల తీరు, లోపాలను ఎత్తిచూపేలా ఈ సినిమా కథ సాగనుందని గతంలో విడుదలైన టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఇందులో సుమంత్ ఉపాధ్యాయుడిగా నటించాడు.