Last Updated:

Game Changer Review:’గేమ్‌ ఛేంజర్‌’ రివ్యూ.. రామ్‌ చరణ్‌-శంకర్‌ కాంబో మెప్పించిందా?

Game Changer Review:’గేమ్‌ ఛేంజర్‌’ రివ్యూ.. రామ్‌ చరణ్‌-శంకర్‌ కాంబో మెప్పించిందా?

Game Changer Movie Telugu Review: రామ్‌ చరణ్‌, డైరెక్టర్‌ శంకర్‌ కాంబో సినిమా అనగానే ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. లార్జర్‌ దేన్‌ లైఫ్‌ సినిమాలకు శంకర్‌ కేరాఫ్‌. అలాంటి డైరెక్టర్‌తో రామ్‌ చరణ్‌ సినిమా, పైగా శంకర్‌ ఫస్ట్‌ స్ట్రయిట్‌ తెలుగు మూవీ కావడంతో మొదటి నుంచి బజ్‌ నెలకొంది. ప్రమోషనల్‌ కంటెంట్‌ మరింత హైప్‌ పెంచాయి. మల్టీస్టారర్‌ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌తో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న చరణ్‌ ఆరేళ్ల తర్వాత గేమ్‌ ఛేంజర్‌తో సోలోగా వచ్చాడు. మరి అగ్ర దర్శకుడు శంకర్‌ డైరెక్షన్, దిల్‌ రాజు భారీ వ్యయంతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను చేరుకుందా? ఏ మేరకు మెప్పించింది రివ్యూలో చూద్దాం!

కథేంటంటే

రామ్‌ నందర్‌ (రామ్‌ చరణ్‌) యువ ఐపీఎస్‌ అధికారి. కాలేజీలో తను ప్రేమించిన అమ్మాయి దీపిక (కియారా అద్వానీ) కోసం తన వ్యక్తిత్వాన్ని మార్చుకుంటాడు. తన కోసమే ఐపీఎస్‌ నుంచి ఐఏఎస్‌ అవుతాడు. దీంతో తన సొంత జిల్లా విశాఖ కలెక్టర్‌గ బాధ్యతలు తీసుకుంటాడు. వచ్చిరాగానే అక్రమార్కుల భరతం పడతాడు. ఇసుక మాఫీయా, రేషన్‌ బియ్యం దందా మాఫీయాకు బుద్ది చెబుతాడు. అయితే ఈ దందాల అన్నింటికి వెనగా ముఖ్యమంత్రి సత్యమూర్తి(శ్రీకాంత్‌) కొడుకు బొప్పిలి మోపిదేవి (ఎస్‌.జె సూర్య) ఉంటాడు.

అభ్యుదయ పార్టీలో కీలకంగా వ్యహరిస్తూ తండ్రి అండతో దందా కొనసాగిస్తాడు. వాటిని రామ్‌ అడ్డుకునే క్రమంలో వీరిద్దరి మధ్య వైర్యం ఏర్పడుతుంది. తనను అవమానించిన రామ్ మీద కేసు పెట్టి మరీ కలెక్టర్ బాధ్యతలకు దూరం చేస్తే.. ఊహించని రీతిలో రామ్ నందన్ ఏకంగా అభ్యుదయం పార్టీకి కీలక వ్యక్తిగా మారతాడు. ఆ తర్వాత వీరిద్దరు మధ్య సమరం ఏ స్థాయికి చేరింది? ముఖ్యమంత్రి కావాలన్న మోపిదేవి కల నేరవేరుతుందా? దాన్ని రామ్‌ నందన్‌ ఎలా ఎదరించాడు? ఇంతకి అప్పన్న (సీనియర్‌ రామ్‌ చరణ్‌)తో రామ్‌కు ఉన్న బంధం ఏంటి? అనేది మిగతా స్టోరీ.

సినిమా ఎలా ఉందంటే..

డైరెక్టర్‌ శంకర్‌ సినిమాలంటే పొలిటిక్‌ టచ్‌ తప్పనిసరిగా ఉంటుంది. వ్యవస్థలో జరిగే అక్రమాలు, అన్యాయాలు చూపిస్తారు. పొలిటికల్‌ డ్రామాకు సందేశాత్మకమైన కథలతో కమర్షియల్‌ సినిమాలు తీయం శంకర్‌ ప్రత్యేకత. ఆ స్పెషాలిటీ మరోసారి గేమ్ ఛేంజర్‌లో చూపించారు. సీఎం కావాలనే కలలు కనే అవినీపరుడైన మంత్రి, ముఖ్యమంత్రి కొడుకును ఓ కలెక్టర్‌ ఎలా కట్టడి చేశాడు అనేదే గేమ్‌ ఛేంజర్‌ కథ. ఇందులో రామ్‌ చరణ్‌ త్రి షేడ్స్‌ సినిమాకు మరింత ప్లస్‌. ముఖ్యంగా అప్పన్న పాత్ర ఎమోషనల్‌గా టచ్‌ చేసింది. నత్తి ఉండే నాయకుడిగా రామ్‌ చరణ్‌ తన యాక్టింగ్‌తో అదరగొట్టాడు. ఈ బ్లాష్‌ బ్యాక్ ఎపిసోడ్‌లో శకంర్‌ టేకింగ్‌, మార్క్‌ కనిపించింది. అలాగే కలెక్టర్‌, ఐఏస్‌ ఆఫీసర్‌ చరణ్‌ త్రీ షేడ్స్‌ బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఎస్.జె.సూర్య ఎప్పట్లానే తన పాత్రకు న్యాయం చేసాడు . మోపిదేవికి ఉన్న పదవి పిచ్చి అతడి కళ్ళల్లో, బాడీ లాంగ్వేజ్ లో స్పష్టంగా కనిపిస్తుంది.

శ్రీకాంత్ ఆశ్చర్యపరిచాడు. ఇన్నాళ్ల కెరీర్లో శ్రీకాంత్ పోషించని పాత్ర లేదు కానీ.. నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో నెగిటివిటీ కనిపించకుండా నటించడం అనేది మాములు విషయం కాదు. శ్రీకాంత్ పాత్ర బాగా ఆకట్టుకుంది. అంజలికి మంచి పాత్ర లభించింది. పార్వతిగా ఆమె క్యారెక్టర్ కొన్నాళ్లు గుర్తుండిపోతుంది. కొండ దేవర పాటలో ఆమె డ్యాన్స్, ఎక్స్ ప్రెషన్స్ విశేషంగా ఆకట్టుకుంటాయి. జయరాం కామెడీ టైమింగ్‌కి మనో డబ్బింగ్ వాయిస్ డామినేట్ చేసింది. సముద్రఖని క్యారెక్టర్ కు అంతగా స్పేస్ లేదు అనే చెప్పొచ్చు. ఇక కియారా అద్వానీకి పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. కానీ పాటల్లో మాత్రం తన గ్లామర్‌తో కట్టిపడేసింది. అందరినీ అమితంగా ఆకట్టుకున్న “నానా హైరానా” పాటను కూడా సినిమా నుంచి కట్ చేయడం అనేది అర్థం కాని విషయం. తమన్ మాత్రం సినిమాకి 100 శాతం న్యాయం చేశాడు. పాటలు, బీజీఎంతో సినిమాను నెక్ట్స్‌ లెవల్‌కి తీసుకువెళ్లాడు. సినిమాకు తమన్‌ సంగీతం, బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ మరింత ప్లస్‌ అయ్యింది.

విశ్లేషణ

తన కల అయిన శంకర్ సినిమా కావడంతో.. దిల్ రాజు ఎక్కడా రాజీపడలేదు. పాటల విషయంలోనే 75 కోట్లు ఖర్చు చేశానని దిల్ రాజు చెప్పుకోగా.. సినిమా మొత్తానికి 400 కోట్ల రూపాయలైంది. క్లైమాక్స్ ఫైట్ పీక్ కమర్షియల్ సినిమా ఫార్మాట్ అని చెప్పొచ్చు. దర్శకుడు శంకర్ తన మార్క్ ని “గేమ్ ఛేంజర్” మీద వేయడంలో కాస్త తడబడ్డాడు. కార్తీక్ సుబ్బరాజు అందించిన కథలో దమ్ము ఉంది, కానీ.. అనవసరంగా ప్రేమకథను ఇరికించడం, అందుకోసం రాసుకున్న ఎపిసోడ్స్ సరిగా వర్కవుట్ అవ్వకపోవడంతో.. సినిమాకి ఆడియన్స్ చాలా చోట్ల డిస్కనెక్ట్ అయిపోతారు. ముందుగా ఈ కథ ప్యాన్ ఇండియన్ సినిమాగా తీసే స్థాయిది కాదు. తెలుగు లేదా తమిళ భాషల్లో మాత్రమే విడుదల చేసి ఉంటే బాగుండేది.

పొలిటికల్ సినిమా కావడం, ఆంధ్రా పాలిటిక్స్ కి సంబంధించి కొన్ని సెటైర్లు, సందర్భాలు ఉండడం అనేది మిగతా భాషల జనాలకి పెద్దగా కనెక్ట్ అయ్యే విషయం కాదు. అయితే.. ‘భారతీయుడు 2’ కంటే చాలా బెటర్ సినిమా ఇది. కానీ.. శంకర్ స్థాయి సినిమా మాత్రం కాదు. శంకర్ నుంచి ప్రేక్షకులు ఆశించేది అతిశయమే కానీ.. అది కూడా నమ్మకంగా, అందంగా ఉండాలి. ఆయన మునుపటి సినిమాలన్నిట్లో ఆ ఫార్మాట్ ను ఫాలో అయ్యారు. కానీ.. ఎందుకో ఈమధ్య అది లోపించింది. అందువల్ల గేమ్ ఛేంజర్ కథ పరంగా, నటీనటుల పెర్ఫార్మెన్స్ పరంగా మంచి సినిమా అయినప్పటికీ.. ప్రేక్షకుల అంచనాలు అందుకోలేక ఇబ్బందిపడుతుంది. ఓవరాల్ గా.. శంకర్ ఒక దర్శకుడిగా ప్రేక్షకుల్ని పూర్తిస్థాయిలో అలరించలేకపోయారనే చెప్పాలి.

శంకర్ సినిమాల్లో లావిష్ నెస్ ఉంటుంది, షాక్ వాల్యూ ఉంటుంది, మంచి మెసేజ్ ఉంటుంది, సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలనే ఆలోచనను రేకెత్తిస్తుంది. గేమ్ ఛేంజర్ లో ఇవన్నీ ఉన్నాయి కానీ సరిగా పొసగలేదు. ముఖ్యంగా అనవసరమైన కమర్షియాలిటీ కారణంగా సినిమాలో ఎలివేట్ అవ్వాల్సిన ఎమోషనల్ ఎలిమెంట్స్ మరుగునపడిపోయాయి. అయితే.. 2024కి ముందు తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ టైమ్ లో జరిగిన హడావుడి మరియు ఆంధ్ర రాజకీయాలు మరియు రాజకీయ నాయకుల మీద కాస్త అవగాహన కలిగినవాళ్ళకి ఈ చిత్రం నచ్చుతుంది. అన్నిటికీ మించి అప్పన్నగా రామ్ చరణ్ నటన, మోపిదేవిగా ఎస్.జె.సూర్య పెర్ఫార్మెన్స్, తమన్ సంగీతం, తిరు సినిమాటోగ్రఫీ వర్క్ కోసం సంక్రాంతి ఆనవాయితీగా ‘గేమ్ ఛేంజర్’ని చూడొచ్చు.