Actor Srikanth: నటుడు శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేటు పూజలు.. శ్రీకాళహస్తి వేద పండితుడిపై వేటు

Srikalahasti Vedic Scholar Suspended: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి ఆలయానికి చెందిన వేద పండితుడిపై సస్పెన్షన్ వేటు పడింది. సినీ నటుడు శ్రీకాంత్ కుటుంబానికి రహస్యంగా పూజలు నిర్వహించినందుకు వేద పండితులపై వేటు పడింది. ఆలయ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటుగా నవగ్రహ శాంతి పూజలు నిర్వహించిన వ్యవహారంపై ఆలయ అధికారులు ఈ చర్యలు తీసుకున్నట్టు సమాచారం. గత నెల 29న శ్రీకాళహస్తి పట్టణంలోని సన్నిధి వీధిలో ఉన్న రాఘవేంద్ర స్వామి మఠంలో హీరో శ్రీకాంత్ కుటుంబం నవగ్రహ శాంతి పూజలు చేయించుకున్న సంగతి తెలిసిందే.
ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ పూజలను ముక్కంటి ఆలయంలో పనిచేస్తున్న కొందరు అర్చకులు, వేద పండితులు నిర్వహించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆలయ ఆచార వ్యవహారాలకు, నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు పూజలు నిర్వహించడంపై ఆలయ అధికారులు సీరియస్ అయ్యారు. సంబంధిత వేద పండితుడిపై సస్పెన్షన్ వేటు పడటంతో ఈ వ్యవహరం ఆలయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.