Peddi First Shot: పెద్ది షాట్.. గ్లోబల్ స్టార్ ను నిలబెడుతుందా.. పడగొడుతుందా..?

Peddi First Shot: మెగా ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆశతో, ఆత్రుతతో ఎదురుచూస్తున్న సినిమా పెద్ది. ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన డైరెక్టర్ బుచ్చిబాబు సానా. మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డును అందుకున్న బుచ్చిబాబు ఎన్టీఆర్ కోసం ఎదురు చూసి.. చూసి.. చూసి.. చేసేదేమి లేక.. రామ్ చరణ్ కు వేరే కథ చెప్పి ఒప్పించాడు. అదే పెద్ది.
రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తున్న పెద్ది సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, మీర్జాపూర్ నటుడు దివ్యేందు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రంగస్థలం తరువాత ఆ రేంజ్ లో రా అండ్ రస్టిక్ లుక్ లో చరణ్ కనిపిస్తున్నాడు.
గేమ్ ఛేంజర్ సినిమాపై మెగా ఫ్యాన్స్ ఎన్ని ఆశలు పెట్టుకున్నారో అందరికీ తెల్సిందే. స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్, దిల్ రాజు నిర్మాణం, కియారా అద్వానీ హీరోయిన్.. రామ్ చరణ్ డబుల్ రోల్.. ఇలా ఒక్కో ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్ లో ఇచ్చారు. ఎన్నిసార్లు వాయిదా పడినా కూడా ఈ కాంబోపై ఉన్న నమ్మకంతో ఫ్యాన్స్ ఏమాత్రం అసహనం వ్యక్తం చేయకుండా రిలీజ్ రోజున సినిమాకు వెళ్లారు. శంకర్ కథ అంటే ఎలా ఉండాలని కోరుకున్నారో.. దానికి అపోజిట్ గా సినిమా ఉండడంతో నిరాశగా బయటకు వచ్చారు.
ఆర్ఆర్ఆర్ తరువాత చరణ్ సోలో హీరోగా తీసిన సినిమా కావడంతో.. జక్కన్న సెంటిమెంట్ కొట్టి గేమ్ ఛేంజర్ డిజాస్టర్ గా నిలిచిందని సరిపెట్టుకున్నారు. కానీ, పెద్ది విషయంలో మాత్రం ఫ్యాన్స్ అలా సర్దిపెట్టుకోలేరు. అందుకు కారణం.. ఈ సినిమా కథనే. చరణ్ లుక్ ను చూసే ఫ్యాన్స్ కథ అంచనాలను వేసుకుంటున్నారు.
ఇక పెద్ది ఫస్ట్ షాట్ శ్రీరామనవమి కానుకగా రేపు రిలీజ్ కానుంది. అసలు ఈ గ్లింప్స్ ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ వలన ఆగుతూ వచ్చిందని టాక్. మొన్నటివరకు ఆయన హెల్త్ బాగోకపోవడంతో ఇంటికేపరిమిత మయిన విషయం తెల్సిందే. దీంతో పెద్ది ఫస్ట్ షాట్ ఆలస్యం అవుతూ వచ్చింది. అయితే ఈసారి మాత్రం ఆలస్యం అయ్యే ఛాన్స్ లేదని తెలుస్తోంది. ఇప్పటికే ఏఆర్ రెహమాన్.. గ్లింప్స్ కు మ్యూజిక్ ను అందించాడని.. రేపు ఉదయం11. 45 కి కచ్చితంగా పెద్ది షాట్ రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.
గత వారం నుంచి సోషల్ మీడియాలో పెద్ది షాట్ ట్రెండింగ్ లో నడుస్తూనే ఉంది. మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమా వైపే చూస్తుంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్లు.. ఈ ఫస్ట్ షాట్ మీదనే అంచనాలు పెట్టుకోవాలా.. ? వద్దా.. ? అనేది ఆధారపడి ఉంది. లుక్ పరంగా ఇప్పటికే మంచి మార్కులు కొట్టేసిన చరణ్.. ఇప్పుడు నటన పరంగా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటాడు అనేదిచర్చనీయాంశంగా మారింది.
పెద్ది ఫస్ట్ షాట్ సక్సెస్ అయితేనే.. సినిమాకు ముందు ముందు మంచి బిజినెస్ జరిగేది. చరణ్ మార్కెట్ ను బట్టి ఈజీగా అయినా.. పెద్ద రికార్డ్ సృష్టించాలంటే.. ఈ షాట్ లోనే తమ టాలెంట్ ను చూపించాలి డైరెక్టర్. ఫస్ట్ షాట్ ను బట్టే సినిమా ఎలా ఉంటుంది అనే అంచనాకు అభిమానులు వచ్చేస్తారు. చరణ్ నటన, బుచ్చి టేకింగ్, ఎలివేషన్స్.. అన్నింటికీ మించి రెహమాన్ మ్యూజిక్ పైనే వ్యాపారం మొత్తం ఆధారపడి ఉంది.
ఎంత గేమ్ ఛేంజర్ ప్లాప్ అయినా కూడా చరణ్ మార్కెట్ ఏమి దెబ్బతినలేదు అనే చెప్పొచ్చు. ఇప్పటికే పెద్ది ఆడియో రైట్స్ కళ్లు చెదిరే రేటుకు అమ్ముడయ్యాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ షాట్ తరువాత బయ్యర్లకు కూడా మరింత నమ్మకం వస్తుందని అంటున్నారు. ఇప్పటివరకు ఈ సినిమాకు అన్ని పాజిటివ్ గానే అవుతూ వచ్చాయి. చరణ్ లుక్, టైటిల్.. హీరోయిన్, మ్యూజిక్.. ఇలా ఇప్పటివరకు ఏది నెగిటివ్ కాలేదు. రేపు వచ్చే షాట్.. చరణ్ ను నిలబెడుతుందా.. పడగొడుతుందా..? అనేది చూడాలి.