Liquor Sales : ఇయర్ ఎండ్ రోజు రికార్డులు బద్దలు కొట్టిన మద్యం సేల్స్ … ఎన్ని వందల కోట్లు అంటే?
Liquor Sales : తెలుగు రాష్ట్రాల్లో కొత్త సంవత్సరం వేడుకలు అంబారాన్ని అంటాయి. మార్పు చెందిన వాడే మనిషి అని పలువురు గొప్ప వ్యక్తులు చెబుతుంటారు. కానీ న్యూ ఇయర్ వేడుకల్లో మందుబాబులు మాత్రం తగ్గేదే లే అంటూ రికార్డులు తిరగరాశారు. ఏపీ, తెలంగాణలలో మద్యం ఎరులై పారిందని ఈ లెక్కలు చూస్తేనే తెలుస్తుంది. ప్రతీ ఏడాది మద్యం సేల్స్ లో రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.
2021 ఏడాది కంటే 2022 ఏడాది మద్యం అమ్మకాలు మరింతగా పెరిగాయి. ప్రభుత్వ ఖజానాకు ప్రతి ఏడాది ఆదాయం పెరుగుతూనే ఉండటం గమనార్హం. 2022 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు తెలంగాణవ్యాప్తంగా మొత్తం రూ.34,352.75 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. 2021లో మొత్తం రూ.18,868 కోట్ల అమ్మకాలు జరిగితే.. 2020లో మొత్తం కలిపి రూ.16,254 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి.
ఏపీలోని ప్రభుత్వ దుకాణాల్లో అర్ధరాత్రి 12 గంటల వరకూ, బార్లలో అర్ధరాత్రి 1 గంట వరకూ విక్రయాలు సాగాయి. కొత్త సంవత్సర వేడుకల్లో రికార్డ్ స్థాయిలో ఆదాయం వచ్చింది. డిసెంబర్ 31వ తేదీ ఒక్కరోజే రికార్డు స్థాయిలో రూ.142 కోట్ల విలువైన మద్యాన్ని మందు బాబులు తాగేశారు. ప్రభుత్వ దుకాణాల్లో రూ.127 కోట్లు, బార్లలో రూ.15 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు సమాచారం అందుతుంది. గతేడాది (2021 డిసెంబరు 31న) రూ.124 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగగా ఈసారి ఆ రికార్డును బద్దలు కొట్టారు.
తెలంగాణలో 2020, 2021 కంటే 2022లో మద్యం అమ్మకాలు భారీ స్థాయిలో జరిగాయి. 2022 డిసెంబర్ నెలలో రూ.3,376 కోట్ల మద్యం అమ్ముడు పోగా… 2021 డిసెంబర్లో రూ.2,901 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. 2022 డిసెంబర్ చివరి వారంలో ఏకంగా రూ.వెయ్యి కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరిగాయని అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 31న రూ.215.74 కోట్ల మద్యం అమ్మకాలు జరగ్గా… డిసెంబర్ 30న రూ.254 కోట్లు మద్యం అమ్మకాలు జరిగాయి. న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 31న అర్థరాత్రి ఒంటి గంట వరకు మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వడం కూడా ఈ ఏడాది మద్యం అమ్మకాలు రికార్దు స్థాయిలో పెరగడానికి కారణమని తెలుస్తోంది. ఏపీతో పొలిస్తే తెలంగాణలో భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి.