Case against Sigachi owner:సిగాచి యాజమాన్యంపై కేసు..

Case against Sigachi owner:పాశమైలారం ఘటనపై కేసు నమోదు అయ్యింది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పాశమైలారం ఫార్మాకంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 39 మంది మరణించగా.. 30 మందికి పైగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరిన్ని మృత దేహాలు శిథిలాల కింద ఉంటే అవకాశం ఉండడంతో అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఈ ఘటనపై బీడీఎల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది.
బాధిత కుటుంబానికి చెందిన సాయియశ్వంత్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సిగాచి కంపెనీలో పాత మిషన్‌లు వాడడం వల్లే ప్రమాదం జరిగిందని అన్నాడు. పాత మిషనరీ వాడుతున్నారని తనతండ్రి చాలాసార్లు చెప్పారని సాయి యశ్వంత్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో సిగాచి కంపెనీ యాజమాన్యంపై 105,110,117 BNS సెక్షన్‌ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
మరోవైపు సిగాచి యాజమాన్యంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఇప్పటికీ వరకు సిగాచి ఎండీ ఘటన స్థలానికి చేరుకోలేదు. నిన్న ప్రమాదం జరిగిన స్థలాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రమాదం జరిగి 24 గంటలు గడుస్తున్న సిగాచి ఎండీ ఘటన స్థలానికి రాకపోవడంపై సీరియస్ అయ్యారు.ఈ ఘటనపై కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.