సర్గమ్ కౌశల్: ప్రపంచ సుందరి కీరీటం జమ్మూవాసి సొంతం.. 21 ఏళ్ల తర్వాత భారత్ దక్కిన గౌరవం
విశ్వవేదికపై భారత్‌కు మరోసారి అందాల కిరీటం దక్కింది. మిసెస్ వరల్డ్ అందాల పోటీల్లో జమ్మూకశ్మీర్‌కు చెందిన మహిళ ‘సర్గమ్ కౌశల్’ విజేతగా నిలిచారు.
Sargam Koushal: విశ్వవేదికపై భారత్‌కు మరోసారి అందాల కిరీటం దక్కింది. మిసెస్ వరల్డ్ అందాల పోటీల్లో జమ్మూకశ్మీర్‌కు చెందిన మహిళ ‘సర్గమ్ కౌశల్’ విజేతగా నిలిచారు. దాదాపు 21 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ కిరీటం భారత్‌కు దక్కడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అమెరికాలోని లాస్వేగాస్లో జరిగిన ‘అంతర్జాతీయ మిసెస్ వరల్డ్ 2022’ అందాల పోటీలు జరిగాయి. దాదాపు 63 దేశాల మహిళలు పాల్గొన్న ఈ పోటీలో విజేతగా నిలిచిన సర్గమ్ నిలిచారు. ఈమెకు 2021లో మిసెస్ వరల్డ్ అమెరికా విజేత షాయలిన్ ఫోర్డ్ మిసెస్ వరల్డ్ కిరీటాన్ని అందజేశారు.
కాగా ఈ పోటీల్లో మిసెస్ పాలినేషియా తొలి రన్నరప్‌గా.. మిసెస్ కెనడా రెండో రన్నరప్‌గా నిలిచారు. సర్గమ్ విజేతగా నిలిచినట్టు మిసెస్ ఇండియా పోటీ నిర్వహణ సంస్థ ఆదివారం అధికారికంగా తన ఇన్‌స్టాఖాతా ద్వారా వెల్లడిస్తూ దానికి సంబంధించిన పోస్టును షేర్ చేసింది. ఇక ఈ విజయంతో దాదాపు 21 ఏళ్ల తర్వాత మన దేశానికి మళ్లీ ఈ కిరీటం దక్కింది. ‘నాకు చాలా ఆనందంగా ఉంది. లవ్ యూ ఇండియా, లవ్ యూ వరల్డ్’’ అంటూ మురిసిపోయారు సర్గమ్.
కాగా వివాహిత మహిళల కోసం ఈ అందాల పోటీలను 1984 నుంచి నిర్వహిస్తున్నారు. 2001లో భారత్‌కు చెందిన డాక్టర్ అదితీ గోవిత్రికర్ తొలిసారి ఈ కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. కాగా ఆ తర్వాత మళ్లీ ఈ ప్రతిష్ఠాత్మక మిసెస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకున్న
మహిళగా సర్గమ్ రికార్డు సృష్టించారు.
ఇదిలా ఉంటే జమ్మూకశ్మీర్ కు చెందిన సర్గమ్ ఇంగ్లీష్ లిటరేచర్‌లో పీజీ పూర్తిచేసి విశాఖపట్నంలో కొంతకాలం టీచర్‌గానూ పనిచేశారు. ఆ తర్వాత క్యాన్సర్ బాధిత పిల్లల కోసం పలు సేవా సంస్థలతో కలిసి సర్గమ్ పనిచేస్తున్నారు. ఆమె భర్త ఆది కౌశల్ భారత నౌకాదళ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇక ఈ కిరీటం సాధించడం పట్ల పలువురు సర్గమ్ కౌశల్‌ను అభినందిస్తున్నారు. మాజీ మిసెస్ వరల్డ్ అదితీ గోవిత్రికర్ సైతం సర్గమ్ పై ప్రశంసలు కురిపించారు.
ఇదీ చదవండి: సంజయ్ దత్: ప్రభాస్ తాతగా బాలీవుడ్ హీరో సంజయ్ దత్.. ఏ సినిమా అంటే..?