Ration Cards: రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం.. త్వరలో 3 రకాల కొత్త రేషన్ కార్డులు

Minister UttamKumar Reddy Ration Cards Update: రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్‌కార్డు విషయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో ఉన్న అర్హులందరికీ త్వరలోనే కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని ప్రకటించారు.
అంతేకాకుండా, ఉగాది పండుగ రోజున తెలంగాణ ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పు వస్తుందని పైరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఆ రోజు నుంచి ప్రతి రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు హుజూర్ నగర్‌లో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభిస్తామని తెలిపారు.
కాగా, రాష్ట్రంలో 85 శాతం ప్రజలకు సన్న బియ్యం అందిస్తామని మంత్రి తెలిపారు. రేషన్ కార్డులో పేరు లేకున్నా.. జాబితాలో పేరు ఉంటే సన్న బియ్యం అందజేస్తామని చెప్పారు. త్వరలోనే 3 రకాల కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అయితే అర్హత ఉండి దరఖాస్తు చేసుకున్న అందరికీ రేషన్ కార్డులు ఇస్తామని వెల్లడించారు.
లబ్ధిదారుల్లో రేషన్ బియ్యంను చాలామంది ఉపయోగించుకోవడం లేదన్నారు. కొంతమంది దొడ్డు బియ్యం తినకుండా బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందన్నారు. అందుకే సన్న బియ్యం అందిస్తామన్నారు. బియ్యంతో పాటు పప్పు, ఉప్పు, ఇతర సరుకులు కూడా త్వరలోనే ఇస్తామని చెప్పారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఎక్కడినుంచైనా రేషన్ బియ్యం తీసుకునేలా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రేషన్ బియ్యం విషయంలో కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కలిసి ప్రతి ఏటా రూ.10,665కోట్లు ఖర్చు చేస్తున్నాయని మంత్రి ఉత్తమ్ తెలిపారు.