Gujarat Blast: ఘోర ప్రమాదం.. బాణాసంచా ఫ్యాక్టరీ పేలుడులో 17 మంది స్పాట్‌డెడ్

Seventeen killed in blaze at firecracker factory in Gujarat’s Banaskantha: గుజరాత్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బనస్కాంతాలో బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ పేలుడు తీవ్రతకు 17 మంది మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. బాయిలర్ పేలడంతో ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
వివరాల ప్రకారం.. దీసా పట్టణానికి సమీపంలో ఉన్న బాణసంచా ఫ్యాక్టరీ యూనిట్‌లో ఒక్కసారిగా పేలుడు చోటుచేసుకోవడంతో మంటలు చెలరేగాయి. ఈ ధాటికి ఆ భవనం కొంతమేర కుప్పకూలింది. దీంతో భవనం శిథిలాల కింద చాలామంది చిక్కుకున్నారని దీసా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ నేహా పంచల్ తెలిపారు.
ఈ ఘటనలో 17 మంది మృతిచెందగా.. గాయపడిన క్షతగాత్రులను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని బనస్కాంత పోలీస్ సూపరింటెండెంట్ అక్షయరాజ్ మక్వానా తెలిపారు. ప్రస్తుతం ఫ్యాక్టరీ యజమాని పరారీలో ఉండగా.. ఆయన కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటన ఉదయం 9.45 నిమిషాలకు భారీ పేలుడు జరిగినట్లు స్థానికులు తెలిపారు. అయితే ఫ్యాక్టరీలో పేలుడు ధాటికి ఆర్‌సీసీ స్లాబ్ కూలిపోయిందని కలెక్టర్ మిహిర్ పటేల్ తెలిపారు. గాయపడిన కార్మికుల పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఫ్యాక్టరీలో బాణసంచా తయారు చేస్తున్న సమయంలో పేలుడు సంభవించిందని దీసా సబ్ డవిజనల్ మేజిస్ట్రేట్ నేహా పంచల్ తెలిపారు.
ఇదెలా ఉండగా, ఫ్యాక్టరీకి సమీపంలోనే కార్మికుల కుటుంబ సభ్యులు నివసిస్తున్నారని, కొంతమంది భవన శిథిలాల కింద చిక్కుకున్నారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంటలు చెలరేగినట్లు సమాచారం వచ్చిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ సహాయక చర్యల్లో ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు.