Anil Ravipudi: వెంకీకి సెట్ అయ్యిందని.. చిరుకి కూడా అదే వాడేస్తున్నావా అనిల్.. ?

Anil Ravipudi: సంక్రాంతికి వస్తున్నాం సినిమా తరువాత డైరెక్టర్ అనిల్ రావిపూడి రేంజ్ మారిపోయింది. దాదాపు రూ. 300 కోట్లు కొల్లగొట్టిన తరువాత ఆ మాత్రం రేంజ్ మారకపోతే కష్టమే అని అనుకోవచ్చు. ఇక ఈ సినిమా తరువాత అనిల్.. చిరంజీవి సినిమాకు కమిట్ అయ్యాడు. వీరి కాంబోలో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాకపోవడంతో చిరును.. అనిల్ ఎలా చూపిస్తాడు అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
ఈ మధ్యనే మెగా 157 పూజా కార్యక్రమాలతో మొదలైన విషయం తెల్సిందే. వెంకటేష్ పూజా కార్యక్రమాలకు విచ్చేసి.. చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపాడు. ఇక నిన్నటికి నిన్న మెగా 157 కి పనిచేసే టెక్నీషియన్స్ అందరిని పరిచయం చేసి హైప్ తీసుకొచ్చారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా కథ తెలుస్తుందా.. ? అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం కోసం ఏదైతే చేసాడో మెగా 157 కోసం కూడా అదే చేస్తున్నాడని టాక్ నడుస్తోంది. అదేంటి.. కొంపతీసి అలాంటి కథతోనే వస్తున్నారా.. ? ఏంటి అని భయపడకండి. నిజం చెప్పాలంటే.. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఆ రేంజ్ గా ప్రేక్షకుల మధ్యకు పోయింది అంటే ప్రమోషన్స్ అనే చెప్పాలి. ముఖ్యంగా వెంకీ మామ. మునుపెన్నడూ లేని విధంగా వెంకీ మామతో చేయించిన ప్రతి ప్రమోషన్ హైలైట్ గా నిలిచాయి.
ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. వెంకీ వాయిస్ తో ఒక సాంగ్ ను పాడించడం మరో ఎత్తు. అదే సాంగ్ ను ప్రతి ప్రమోషన్ లో వెంకీ పాడడం, స్టెప్స్ వేయడంతో ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇప్పుడు ఇదే పద్దతిని చిరు కోసం కూడా వాడేస్తున్నాడట అనిల్ రావిపూడి. అవును.. మెగా 157 కోసం చిరు సింగర్ గా మారబోతున్నాడని టాక్. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్.. చిరు కోసం ఒక సాంగ్ ను రెడీ చేస్తున్నాడట.
హీరోలు సాంగ్స్ పాడడం కొత్తేమి కాదు. అయితే చిరు మాత్రం ఇప్పటివరకు కేవలం రెండు సినిమాల్లోనే తన గొంతును వినిపించాడు. మాస్టర్ సినిమాలో తమ్ముడు అరేయ్ తమ్ముడు అంటూ పాడి మెప్పించాడు. ఆ తరువాత మృగరాజులో ఏ ఛాయ్ చటుక్కున తాగారా భాయ్ అంటూ ఆలపించాడు.
ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి చిరు.. మెగా 157 కోసం ఒక సాంగ్ ను ఆలపిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వెంకీకి వర్క్ అవుట్ అయ్యిందని చిరుకు ఇది వర్క్ అవుట్ అవుతుంది అన్న గ్యారెంటీ లేదు. మరి ఇందులో ఎంత నిజం ఉంది. ఒకవేళ ఇది నిజమైతే భీమ్స్ రిస్క్ తీసుకుంటున్నాడా.. ? అనేది ముందు ముందు తెలుస్తుంది.