Published On:

Pawan Kalyan on Tollywood: సినీ ఇండస్ట్రీకి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం

Pawan Kalyan on Tollywood: సినీ ఇండస్ట్రీకి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం

Pawan Kalyan Route Map for Tollywood: రాష్ట్రంలో సినిమా హాళ్ల నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని ఆ దిశగా సంబంధిత ప్రభుత్వ శాఖలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. కొత్త చిత్రాలు విడుదల సందర్భంలో టికెట్ ధరల పెంపు నిమిత్తం నిర్మాతలు, వారికి సంబంధించినవారు వ్యక్తిగత హోదాలో కాకుండా తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించే విధానాన్ని అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు.

 

సినిమా హాళ్ల బంద్ ప్రకటనలు, ఈ క్రమంలో తమ శాఖ ద్వారా చేపట్టిన చర్యలను, తాజా పరిణామాలను రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్.. ఉప ముఖ్యమంత్రికి వివరించారు. త్వరలో విడుదలయ్యే హరిహర వీరమల్లు సినిమాకు సైతం టికెట్ ధరల పెంపు కోసం నిర్మాత వ్యక్తిగతంగా కాకుండా చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వానికి అర్జీ ఇచ్చి, సంప్రదింపులు చేయాలని… ఇందులో తన మన బేధాలు పాటించవద్దు అని స్పష్టంగా చెప్పారు.

 

టికెట్ ధర కంటే సినిమా హాల్లో పాప్ కార్న్ లాంటి తినుబండారాలు, శీతల పానీయాలు, చివరకు మంచి నీళ్ల సీసాల ధరలు సైతం భారీగా ఉండటంపై ఈ సందర్భంగా చర్చించారు. వాస్తవంగా వాటి ధరలు ఎంత ఉంటున్నాయి, ఎంతకు విక్రయిస్తున్నారు, అసలు వాటిలో ఉండే నాణ్యత ప్రమాణాలు ఏమిటనేది కూడా సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ధరల నియంత్రణ కూడా చేపట్టాలని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్స్ లో ఆహార పదార్థాలు, శీతల పానీయాల వ్యాపారంలోను గుత్తాధిపత్యం సాగుతోందనే విషయం కూడా ప్రభుత్వ దృష్టికి వచ్చినందున దీనిపై విచారణ చేపట్టాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి సూచించారు.

 

ఇవి కూడా చదవండి: