Samantha: శుభం.. కొత్త ప్రయాణం మొదలు పెట్టిన సామ్

Samantha: స్టార్ హీరోయిన్ సమంత కొత్త ప్రయాణం మొదలుపెట్టింది. అవునా.. నిజమా.. మళ్లీ పెళ్లి చేసుకోబోతుందా.. ? అని ఆశ్చర్యపోకండి. ఆమె కొత్త ప్రయాణం.. నిర్మాతగా మొదలుపెట్టింది. గతేడాదిలోనే సామ్ త్రలాలా మూవింగ్ పిక్చర్స్ అనే పేరుతో ఒక ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించినట్లు చెప్పుకొచ్చింది. ఈ బ్యానర్ లోనే ఆమె మా ఇంటి బంగారం అనే సినిమాను అనౌన్స్ చేసింది. ఆ సినిమా ఇప్పటివరకు పట్టాలెక్కింది లేదు. ఇందులో సామ్ ప్రధాన పాత్రలో నటిస్తుందని తప్ప మిగతా వివరాలేవీ రివీల్ చేయలేదు.
ఇక మా ఇంటి బంగారం గురించి పక్కన పెడితే.. ఇప్పుడు ఆ బ్యానర్ లో అమ్మడు మరో సినిమాకు కొబ్బరికాయ కాదు ఏకంగా గుమ్మడికాయనే కొట్టింది. ఈమధ్యకాలం స్టార్స్ అందరూ చిన్న చిన్న ప్రొడక్షన్ హౌసెస్ ను ఓపెన్ చేసి.. కొత్త కథలను, నటీనటులను, డైరెక్టర్స్ ను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. రవితేజ, నాని, సూర్య.. వీరందరూ ఇదే పనిలో ఉన్నారు. తాజాగా ఆ లిస్ట్ లో సామ్ కూడా చేరింది.
త్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ లో సామ్ నిర్మిస్తున్న మొదటి చిత్రం శుభం. చచ్చిన చూడాల్సిందే అనేది ట్యాగ్ లైన్. మెయిల్, అర్దమయ్యిందా అరుణ్ కుమార్, కల్కి 2898AD సినిమాల్లో నటించిన హర్షిత్ రెడ్డి హీరోగా.. గ్యాంగ్ లీడర్ సినిమాలో నాని చెల్లిగా నటించిన శ్రియ కొంతం హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సినిమా బండి సినిమాతో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ గా మారిన ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ కుర్ర హీరో పరదా అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ కు రెడీ గా ఉంది. ఇంకా ఆ సినిమా రిలీజ్ కాకముందే మరో సినిమాను లైన్లో పెట్టి షాక్ ఇచ్చాడు.
తాజాగా శుభం సినిమా షూటింగ్ పూర్తయ్యిందని సామ్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో తెలిపింది. షూటింగ్ లాస్ట్ రోజు చిత్రబృందంతో కలిసి సామ్ కూడా సందడి చేసింది. ఈ కార్యక్రమంలో చిత్ర బృందంతో పాటు లేడీ డైరెక్టర్ నందినిరెడ్డి కూడా సందడి చేసింది. ఒక పోస్టర్ ను రిలీజ్ చేస్తూ సామ్.. అత్యంత ఉత్సాహంతో, త్రాలాలా మూవింగ్ పిక్చర్స్‌లో మా మొదటి థియేట్రికల్ ప్రొడక్షన్ శుభం విడుదలకు సిద్ధంగా ఉందని ప్రకటించడానికి గర్విస్తున్నాము. ఈ సినిమా కోసం వేచి ఉండండి” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన అభిమానులు శుభం.. సామ్ కూడా నిర్మాతగా ఎంట్రీ ఇచ్చింది అంటూ చెప్పుకొస్తున్నారు. మరి హీరోయిన్ గా సక్సెస్ అందుకున్న సామ్ నిర్మాతగా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
View this post on Instagram