MLC Nomination : ఎమ్మెల్సీ అభ్యర్థుల నామిషన్ దాఖలు

MLC Nomination : తెలంగాణలో మరోసారి ఎన్నికల సందడి నెలకొంది. ఎమ్మెల్యేల కోటా కింద మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ ఏర్పడటంతో ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు నామిషనేషన్ల గడువు ముగియనున్నది. ఇప్పటికే అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ నుంచి ముగ్గురు, సీపీఐ ఒకరు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకరిని బరిలోకి దింపారు. ఈ మేరకు తాజాగా కాంగ్రెస్ అభ్యర్థులుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదిరులు పాల్గొన్నారు. మరోవైపు సీపీఐ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం నామపత్రాలు దాఖలు చేయగా, కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు పాల్గొన్నారు. కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు తదితరులు పాల్గొన్నారు.
శాసనసభలో ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీకి 4, బీఆర్ఎస్‌కు ఒకటి దక్కనున్నాయి. తమకు వచ్చే 4 సీట్లలో ఒక సీటును పొత్తులో భాగంగా సీపీఐ పార్టీకి కాంగ్రెస్ కేటాయించింది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీపీఐ పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని కొత్తగూడెం సీటును కేటాయించింది. అప్పుడు తమకు 2 సీట్లు కావాలని సీపీఐ పట్టుబట్టింది. కానీ, కొత్తగూడెం ఇచ్చి భవిష్యత్‌లో ఎమ్మెల్సీ సీటు ఇస్తామని కాంగ్రెస్ సీపీఐ పార్టీకి హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా సీటును కేటాయించింది.