MLA quota MLC elections: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ.. ఎమ్మెల్సీ యోగం ఎవరికో?

MLA quota MLC elections Getting Interesting: ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగటంతో పెద్దసంఖ్యలో ఆశావహులు.. తమ ప్రయత్నాల్లోకి దిగారు. రాష్ట్రంలో ఐదుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం వచ్చే నెల్లో ముగియనుండడంతో ఈ స్థానాలకు ఎన్నిక నిర్వహించేందుకు వీలుగా గత సోమవారం షెడ్యూల్ జారీ అయిన సంగతి తెలిసిందే. కాగా, నామినేషన్ల దాఖలుకు మరో రెండు వారాలే ఉండటంతో నేతలంతా తమ పార్టీ నేతల చుట్టూ ప్రదక్షిణాలు ఆరంభించారు.
మార్చి 20న పోలింగ్
ప్రస్తుతం తెలుగుదేశం ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్న జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, పరుచూరి అశోక్ బాబు, బీటీ నాయుడు, యనమల రామకృష్ణుడుల పదవీ కాలం మార్చి 29తో ముగియనుంది. ఈ లోగా కొత్తవారిని నియమించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 20వ తేదీన దీనికోసం పోలింగ్ జరగనుంది. ఈ 5 సీట్లు కూటమికే ఏకగ్రీవంగా దక్కనున్నందున.. ఇప్పటి నుంచే ఆశావహులంతా తమ ప్రయత్నాల్లోకి దిగారు.
తొలి సీటు నాగబాబుకే..
ఈ జాబితాలో జనసేన నుంచి పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు ఒక సీటు ఇప్పటికే కన్ఫామ్ అయింది. ఆయనకు మంత్రిగానూ అవకాశం కల్పించాలని సీఎం, డిప్యూటీ సీఎం ఇప్పటికే నిర్ణయించారు. ఇక.. ఆ మిగిలిన 4 సీట్లలో ఒక సీటును బీజేపీ కోరుతున్నట్లుగా తెలుస్తోంది. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పోటీలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే.. ఇది మిగిలేది మూడు సీట్లు మాత్రమే.
ఆశావహుల జాబితా..
గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని అర్హతలున్నా.. జనసేన, బీజేపీ అభ్యర్థుల కోసం సీటును వదులుకుని, గత 9 నెలలుగా ఎలాంటి నామినేటెడ్ పోస్టు లేదా పార్టీలో పెద్ద బాధ్యత దక్కని నేతల పేర్లను టీడపీ అధిష్ఠానం పరిశీలిస్తోంది. దీనికి తోడు, సామాజిక, ప్రాంతాల వారీ సమీకరణాలనూ జోడించి చూశాక.. పది మంది నేతలు కీలక పోటీదారులుగా కనిపిస్తున్నారు. వారిలో టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ, పిఠాపురం టీడీపీ నేత వర్మ, మాజీమంత్రులు జవహర్, దేవినేని ఉమామహేశ్వరావు తొలి నాలుగు స్థానాల్లో ఉండగా, రెడ్డి సుబ్రహ్మణ్యం, గన్ని వీరాంజనేయులు, తిప్పేస్వామి, నల్లపాటి రాము, ప్రభాకర్ చౌదరి, కొమ్మాలపాటి శ్రీధర్ తదితరులు ఉన్నారు.
లోకేశ్ జాబితా..
గత ఐదేళ్లలో పార్టీ విపక్షంలో ఉండగా ఎమ్మెల్సీలుగా ఉంటూ అమరావతి ఉద్యమంలో పాల్గొన్న నేతలూ తమకు అవకాశం ఇవ్వాలంటూ నారా లోకేశ్‌ను కలిసే ప్రయత్నాలు ఆరంభించారు. ప్రభుత్వంపై శాసనమండలిలో గట్టి పోరాటం చేసిన మంతెన సత్యనారాయణ రాజు, బీదా రవిచంద్ర యాదవ్, బుద్ధా వెంకన్న, అంగర రామ్మోహన్ తదితరులు ఈసారి తమ పేరును పరిశీలించాలని కోరారు. డొక్కా మాణిక్య వరప్రసాద్, పోతుల సునీత లాంటి వారు క్లిష్టసమయంలో పార్టీని వదిలినా ఎలాంటి ఒత్తిళ్లకూ లొంగకుండా పార్టీ కోసం తాము నిలిచామని వీరు చెప్పుకొస్తున్నారు.
వీరికి పక్కా?
ఇటీవల వైసీపీని వీడి టీడీపీ కండువా కప్పుకున్న మోపిదేవి వెంకటరమణకు ఎమ్మెల్సీగా అవకాశం రావడం ఖాయమన్న ప్రచారం టీడీపీ వర్గాల్లో సాగుతోంది. అలాగే, కాపు సామాజిక వర్గంలో కీలక నేత, దివంగత రంగా కుమారుడైన రాధా… గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి, కూటమి విజయం కోసం పని చేసినందున ఆయనకు ఇప్పటికే టీడీపీ అధిష్ఠానం ఓ సీటు రిజర్వ్ చేసిందనే టాక్ కూడా వినిపిస్తోంది.
వర్మకు ఇప్పడు లేనట్లే
అయితే.. పిఠాపురంలో పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు ఈ సారి కూడా నిరాశే మిగిలే అవకాశం కనిపిస్తోంది. సామాజిక సమీకరణాల దృష్ట్యా ఆయన పేరును టీడీపీ హైకమాండ్ ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థలు, లేదా గవర్నర్ కోటాలో వర్మకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం.
ఆ నలుగురి ప్రయత్నాలు..
కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయం తర్వాత వైసీపీలో ఉండలేమంటూ ఆ పార్టీకి, ఎమ్మెల్సీ పదవులకు కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, బల్లి కళ్యాణ చక్రవర్తి, జయమంగళ వెంకటరమణలు రాజీనామాలు చేశారు. వీరు రాజీనామాలు చేసి నెలలు దాటుతున్నా మండలి ఛైర్మన్ ఇంతవరకూ వాటిని ఆమోదించకపోవటంతో వివాదంగా మారుతోంది. దీంతో, ఈ ఐదు స్థానాలు భర్తీ కాగానే, జగన్ మీద అసంతృప్తితో ఉన్న మరికొందరు వైసీపీ ఎమ్మెల్సీల మద్దతుతో మండలి ఛైర్మన్‌పై అవిశ్వాసం పెట్టే దిశగా కూటమి నేతలు యోచిస్తున్నట్లు సమాచారం.