Last Updated:

Chhattisgarh: భారీ ఎన్‌కౌంటర్.. 12 మంది మావోయిస్టుల మృతి

Chhattisgarh: భారీ ఎన్‌కౌంటర్.. 12 మంది మావోయిస్టుల మృతి

Maoists Encounter in Chhattisgarh twelve Naxalites killed: ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. గరియాబంద్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో 12మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టులకు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మృతి చెందిన 12 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు గరియాబంద్ ఎస్పీ తెలిపారు.

ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దులో గత కొంతకాలంగా భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే గరియాబంద్‌ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు ఆపరేషన్ నిర్వహించాయి.అయితే ఒక్కసారిగా మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో మావోయిస్టులకు, భద్రతా దళాలకు మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి.

ఈ కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందగా.. మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఇందులో శ్రీకాకుళం కోరాపుట్ డివిజన్ ఇన్‌ఛార్జ్ చలపతి మృతి చెందారు. మావోయిస్టు చలపతి స్వస్థలం ఏపీలోని చిత్తూరు జిల్లాగా గుర్తించారు. కాగా, ఈ ఎదురుకాల్పుల్లో ఓ జవాన్ గాయపడడంతో వెంటే ఆయనను ప్రత్యేక హెలికాప్టర్‌లో రాయ్‌పూర్ తరలించారు.

ఈ మేరకు ఆ ప్రాంతంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ప్రాంతంలో నిన్నటినుంచి భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. మావోయిస్టు క్యాంప్‌పై పక్కా సమాచారంతో ఆపరేషన్ చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కూంబింగ్ కొనసాగుతోంది.

ఇదిలా ఉండగా, మావోయిస్టుల ఏరివేసేందుకు కేంద్రం ఫోకస్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఛత్తీస్ గఢ్, ఒడిశా సరిహద్దుల్లో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఇందులో భాగంగానే జనవరి 19 రాత్రి నుంచి ఎన్‌కౌంటర్ చేపట్టినట్లు వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో ఛత్తీస్‌గఢ్, ఒడిశా పోలీసులు, సీఆర్‌ఫీఎప్ సిబ్బంది పాల్గొన్నారు. నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. అయితే ఈ ఆపరేషన్‌లో దాదాపు 1000 మంది భద్రతా సిబ్బంది పాల్గొన్నట్లు సమాచారం.