IPL 2025: నేడు ఐపీఎల్‌లో డబుల్ ధమాకా.. హైదరాబాద్ గెలిస్తేనే!

Sunrisers Hyderabad vs Punjab Kings AND Lucknow Super Giants vs Gujarat Titans: ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. లక్నో వేదికగా జరిగే 26వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3.30 నిమిషాలకు ప్రారంభం కానుంది. ఆ తర్వాత హైదరాబాద్ వేదికగా 27వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో అన్ని జట్లు విజయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నాయి. దీంతో రెండు మ్యాచ్‌లు హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది.
గతేడాది రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్‌లో విఫలం చెందుతోంది. సీజన్ ప్రారంభంలో తొలి మ్యాచ్ ఘన విజయం సాధించిన హైదరాబాద్.. ఆతర్వాత వరుసగా 4 మ్యాచ్‌లు ఓడింది. దీంతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది. ఇక, తర్వాత ఆడనున్న 9 మ్యాచ్‌లలో తప్పనిసరిగా 7 మ్యాచ్‌లు గెలవాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచ్ వెటోరీ మీడియాతో మాట్లాడారు. దూకుడుగా ఆడితేనే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్ల అత్యుత్తమ ఆట బయటికొస్తుందన్నారు. అయితే మా బ్యాటర్లకు ఎలాంటి బంతులు వేయాలన్న దానిపై ఇతర జట్లు పూర్తి ప్లాన్‌తో వస్తున్నాయన్నారు. ఇద్దరు బ్యాటర్లు చెలరేగినా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఆపడం కష్టమేనన్నారు. మా ప్లేయర్స్ కమ్ బ్యాక్ ఇస్తారన్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు.
పంజాబ్ విషయానికొస్తే.. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడగా.. మూడింట్లో గెలిచింది. ఒక్క మ్యాచ్‌లో ఒటమి చెందగా.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.