IPL 2025 33rd Match: ముంబై చేతిలో ఓడిన సన్‌రైజర్స్.. ప్లేఆఫ్స్ చేరడం కష్టమే!

Mumbai Indians won by 4 Wickets Agianst Sunrisers Hyderabad: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మళ్లీ బోల్తా పడింది. ముంబై వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఆసక్తికర మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది. చివరి వరకు ఉత్కంఠగా జరిగిన ఈ పోరులో ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో ముంబై మూడో విజయాన్ని అందుకోగా.. హైదరాబాద్ ఐదో ఓటమిని చవిచూసింది. ఇక, హైదరాబాద్ ప్లేఆప్స్ చేరడం కష్టమేనని తెలుస్తోంది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడగా.. 5 మ్యాచ్‌ల్లో ఓడింది. దీంతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది.
తొలుత టాస్ గెలిచిన ముంబై జట్టు బౌలింగ్ ఎంచుకోగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ తీసుకుంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ(40), హెడ్(28) మంచి శుభారంభం అందించగా.. తర్వాతి బ్యాటర్లు తేలిపోయారు. పవర్ ప్లేలో హైదరాబాద్ జట్టు వికెట్ నష్టపోకుండా 46 పరుగులు చేసింది. అయితే ఈ సమయంలో హార్దిక్ బ్రేక్ ఇచ్చాడు. హార్దిక్ వేసిన బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్(2) ఎక్కువసేపు క్రీజులో ఉండలేకపోయాడు. ఆ వెంటనే హెడ్ కూడా పెవిలియన్ చేరడంతో హైదరాబాద్ కష్టాల్లో పడింది. నితీశ్(19), క్లాసెన్(37) పరుగులు చేశారు. అనికేత్(18), కమిన్స్(8) వేగంగా ఆడారు. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 162 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో విల్ జాక్స్ 2 వికెట్లు పడగొట్టగా.. బౌల్ట్, బుమ్రా, హార్దిక్ పాండ్య తలో వికెట్ తీశారు.
163 పరుగుల లక్ష్యఛేదనలో ముంబై ఆచితూచి ఆడింది. ఓపెనర్ రోహిత్ శర్మ(26) దూకుడుగా ఆడుతున్న తరుణంలో కమిన్స్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. రికిలిటన్ (31), విల్ జాక్స్(36), సూర్యకుమార్(26), తిలక్ వర్మ(21) హార్దిక్(21) పరుగులు చేసి ముంబైను గెలిపించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో కమిన్స్ 3 వికెట్లు పడగొట్టగా.. ఇషాన్ మలింగ్ 2 వికెట్లు, హర్షల్ ఒక వికెట్ తీశాడు.