IPL 2025: బట్లర్ మెరుపు ఇన్నింగ్స్.. బెంగళూరుపై గుజరాత్ ఘన విజయం

Jos Buttler powers Gujarat Titans to 8-wicket win: ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా బెంగళూరు వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన బెంగళూరు.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. బెంగళూరు బ్యాటర్లలో ఓపెనర్లు ఫిన్ సాల్ట్(14), కోహ్లీ(7) విఫలమయ్యారు. ఆ తర్వాత వచ్చిన పడిక్కల్(4), పాటిదార్(12) సైతం త్వరగానే పెవిలియన్ చేరారు. 42 పరుగులకే టాప్ ఆర్డర్లు విఫలమయ్యారు.
కష్టాల్లో ఉన్న ఆర్సీబీని లివింగ్ స్టన్(54),జితేశ్ శర్మ(32) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఆ తర్వాత దూకుడుగా ఆడుతున్న శర్మ ఔట్ కావడంతో క్రీజులోకి వచ్చిన కృనాల్(5)ను తొందరగానే పెవిలియన్ చేర్చారు. ఇక, చివరిలో టిమ్ డేవిడ్(32) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఆర్సీబీ 169 పరుగుల మార్క్‌ను చేరింది. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 3 వికెట్లు పడగొట్టగా.. సాయికిశోర్ 2, అర్షద్ ఖాన్, ప్రసిద్ధ్, ఇషాంత్ తలో వికెట్ తీశారు.
170 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 2 వికెట్ల నష్టానికి సునాయాస విజయాన్ని సాధించింది. ఓపెనర్ సాయి సుదర్శన్(49), బట్లర్(73) కీలక ఇన్నింగ్స్ ఆడారు. అంతకుముందు గిల్(14) క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 32 పరుగులు వద్ద వికెట్ కోల్పోయిన గుజరాత్‌ను సాయి సుదర్శన్, బట్లర్ నెమ్మదిగా ఆడుతూ అవసరమైనపుడే బౌండరీలు బాదుతూ వచ్చారు. 13వ ఓవర్‌లో సుదర్శన్ ఔట్ అయ్యాడు. కానీ అప్పటికే గుజరాత్ 107 పరుగులు చేసింది. ఈ తరుణంలో బట్లర్, రూథర్‌ఫర్డ్(30)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. దీంతో గుజరాత్ 17.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్, హేజిల్ వుడ్ చెరో వికెట్ తీశారు.