Last Updated:

V. Ramasubramanian: కొత్త ఎన్‌హెచ్‌ఆర్సీ ఛైర్మన్‌ నియామకం.. కమిటీ సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదం

V. Ramasubramanian: కొత్త ఎన్‌హెచ్‌ఆర్సీ ఛైర్మన్‌ నియామకం.. కమిటీ సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదం

Former Supreme Court judge V. Ramasubramanian appointed NHRC: జాతీయ మానవహక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) నూతన ఛైర్మన్‌గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి వి. రామసుబ్రమణియన్‌ నియమితులయ్యారు. కమిటీ సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఎన్‌హెచ్‌ఆర్సీ ఛైర్మన్ అరుణ్ కుమార్ మిశ్రా పదవీ కాలం జూన్ 1న ముగియగా, నాటి నుంచి తాత్కాలిక చైర్‌పర్సన్‌గా విజయ భారతి సయానీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే.

చెన్నైలో పుట్టి.. ఛైర్మన్ వరకు
వి.రామసుబ్రమణియన్‌ 2019 సెప్టెంబరు 23న సుప్రీంకోర్టు జడ్డిగా బాధ్యతలు స్వీకరించారు. చైన్నైలో జన్మించిన ఈయన మద్రాస్‌ లా కాలేజీలో ఎల్.ఎల్.బి పూర్తి చేసి 1983 ఫిబ్రవరి 16న బార్‌ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకున్నారు. 1983లో లాయరుగా ప్రాక్టీస్‌ ప్రారంభించి 23 సంవత్సరాలపాటు చెన్నై హైకోర్టులో వాదించారు. పిదప 31 జూలై 2006లో మద్రాస్‌ హైకోర్టు జడ్జిగా నియమితులై పదేళ్లు సేవలందించి, పిదప 2016 ఏప్రిల్ 27 నుంచి 2019 జూన్ 21 వరకు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా, 2019 జూన్ 22 నుంచి 4 నెలల పాటు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2019 సెప్టెంబరు 23న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులై 2023 జూన్‌ 30వ తేదీ వరకు కొనసాగారు.

ఏకాభిప్రాయంతో..
కాగా, డిసెంబర్ 18న తదుపరి చైర్‌పర్సన్‌ను ఎంపిక చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ సమావేశం నిర్వహించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ ​​పార్టీ అధినేత రాహుల్ గాంధీ రాజ్యసభ, లోక్‌సభలో ప్రతిపక్ష నేతలుగా సమావేశానికి హాజరయ్యారు. ఈ పదవికి మాజీ ప్రధాన న్యాయమూర్తులను లేదా సుప్రీంకోర్టు రిటైర్ట్ జడ్జిలను నియమించటం ఆనవాయితీగా వస్తోంది. కాగా, గతంలో మాజీ సీజేఐలు హెచ్‌ఎల్ దత్తు కేజీ బాలకృష్ణన్ కూడా హెచ్‌ఆర్సీ పదవిలో ఉన్నారు.
ఈసారి ఇటీవలే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి నుంచి తప్పుకున్న డివై చంద్రచూడ్‌ను నియమిస్తారనే వార్తలు కూడా నిన్నటి వరకు వచ్చిన సంగతి తెలిసిందే.