Cyclone Effect: ముంచుకొస్తున్న మరో తుఫాను.. ఏపీకి భారీ వర్ష సూచన
Cyclone Effect On Andhra Pradesh: మరో తుఫాను ముంచుకొస్తుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఈ ప్రభావంతో ఏపీలోని కోస్తా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న 24 గంటల్లో తమిళనాడు, కోస్తా ప్రాంతాలకు ప్రభావం చూపనుంది.
ఈ అల్పపీడనం ప్రభావంతో రెండు రోజులపాటు ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. నేడు ఏపీలోని విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అలాగే శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాము, అంబేద్కర్ కోనసీమ, నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు పడనున్నాయని తెలిపింది.
ఈ అల్పపీడనం ప్రభావంతో గంటకు సుమారు 55 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. కావున సముద్ర ప్రాంతాల్లో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. ఇదిలా ఉండగా, తిరుపతి, ఏలూరు, అనకాపల్లి, బాపట్ల, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.