Atishi : ఢిల్లీ సీఎం భర్త ప్రభుత్వాన్ని నడుపుతున్నారు.. అతిశీ సంచలన ఆరోపణలు

Former Delhi CM Atishi : ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా భర్త మనీశ్ గుప్తాపై ఆప్ నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి అతిశీ సంచలన ఆరోపణలు చేశారు. మనీశ్ గుప్తా అనధికారికంగా ఢిల్లీ సర్కారును నడుపుతున్నారని ఆరోపించారు. మనీశ్ గుప్తా పలువురు అధికారులతో సమావేశమైన ఫొటోను అతిశీ ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
దేశ చరిత్రలో ఇదే మొదటిసారి..
ఢిల్లీ సీఎం రేఖాగుప్తా భర్త మనీశ్ గుప్తా పలువురు అధికారులతో సమావేశమయ్యారని తెలిపారు. గ్రామాల్లో సర్పంచ్‌గా మహిళ ఎన్నికైతే ప్రభుత్వ విధులను సీఎం భర్త చూసుకుంటున్నారని మనం గతంలో వినేవాళ్లం అని పేర్కొన్నారు. కానీ, ఒక మహిళా ముఖ్యమంత్రి చేయాల్సిన పనులను ఆమె భర్త చేయడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి అన్నారు. రేఖాగుప్తాకు ప్రభుత్వ విధులు ఎలా నిర్వర్తించాలో తెలియదా? అని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఢిల్లీలో విద్యుత్ కోతలు, ప్రైవేట్ పాఠశాలల ఫీజులు పెరిగిపోవడానికి కారణం ఆయా శాఖల్లో ముఖ్యమంత్రి ప్రవేయం లేకపోవడమేనా? అని అతిశీ ప్రశ్నించారు.
ఖండించిన బీజేపీ..
అతిశీ ఆరోపణలను ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా ఖండించారు. ఒక మహిళ మరొక మహిళా ముఖ్యమంత్రిపై ఇలాంటి అవమానకర వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ప్రజా సేవ పట్ల తనకున్న నిబద్ధతతో సీఎం రేఖగుప్తా, డీయూఎస్‌యూ స్టూడెంట్స్ యూనియన్ కార్యదర్శి పదవి నుంచి ఢిల్లీ సీఎం పదవి వరకు తన సొంత కృషితో ఎదిగారని గుర్తుచేశారు. అయినా కూడా ఆమె భర్త రేఖాగుప్తాకు మద్దతు ఇవ్వడం చట్టవిరుద్ధం కాదన్నారు.