Last Updated:

BRS: ఏపీలో బీఆర్ఎస్ ప్రభావమెంత?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్‌ను ఏర్పాటు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.

BRS: ఏపీలో బీఆర్ఎస్ ప్రభావమెంత?

BRS: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్‌ను ఏర్పాటు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ఈ నేపథ్యంలోనే పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో కూడా బీఆర్ఎస్ తన ఉనికిని గట్టిగా చాటుకోవాల్సిన పరిస్థితి ఉంది. ముందుగా ఏపీతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలోనూ పాగా వేయాలని కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. తొలుత కర్ణాటక, మహారాష్ట్రలలో తమ కార్యకలాపాలు మొదలవుతాయని ప్రకటించారు కూడా.అయితే 2019 ఎన్నికల్లో జగన్‌కు అండగా నిలిచిన కేసీఆర్‌కు ఇప్పుడు జగన్ సాయం చేసే పరిస్థితి లేదు. పరోక్షంగా కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్‌కు జగన్ బేషరతుగా మద్దతిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఏపీలో బీఆర్ఎస్ జెండా రెపరెపలాడడం అనేది కేసీఆర్ కు కత్తి మీద సామువంటిదే. అందులోనూ జనసేన ప్రత్యక్షంగా…టీడీపీ పరోక్షంగా బీజేపీకి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో పొరుగురాష్ట్రంలో బీఆర్ఎస్‌ది నల్లేరు మీద నడక కాదు.

ఈ క్రమంలోనే ఏపీలో పాగా వేసేందుకు కేసీఆర్ సన్నాహాలు మొదలుపెట్టారు. అక్కడ తనకు కలసి వచ్చే నాయకులను ఆయన చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏపీలో బహిరంగ సభలో ఏర్పాటు చేసి తమ పార్టీ ఉనికిని చాటేందుకు కేసీఆర్ ప్రయత్నించబోతున్నారట. ఈ విషయాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరిలో గుంటూరు లేదా విజయవాడలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని ఆయన తెలిపారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో భూస్థాపితం అయిన కాంగ్రెస్ నేతలు మినహా టీఆర్ఎస్ కు మిగతా నేతలు మద్దతిచ్చే అవకాశం ఉండకపోవచ్చు. అదీగాక గత రెండు ఎన్నికల సందర్భంగా ఏపీ నేతలపై విమర్శలు గుప్పించిన కేసీఆర్…ఇప్పుడు పార్టీ పెడుతున్నా అంటూ వస్తే ఆదరించే అవకాశాలు చాలా తక్కువనే చెప్పవచ్చు. మరోవైపు.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలు నెరవేర్చకుండా ఉంటోన్న కేంద్రాన్ని తాము నిలదీస్తామని బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, పోలవరానికి నిధుల విడుదలలో జాప్యం, రైల్వే జోన్, మూడు రాజధానుల వ్యవహారం వంటి సమస్యలు ఎజెండాగా ప్రజలను కేసీఆర్ ఆకట్టుకునే అవకాశం ఉంది. ఏదేమైనా ఏపీలో బీఆర్ఎస్ ది కేక్ వాక్ కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన ఏపీలోని పలు ప్రాంతాల్లో సంబరాలు చోటు చేసుకున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. తన పార్టీని ఏపీలో వ్యాపించే ప్రయత్నంలో ఆ రాష్ట్రానికి చెందిన వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. అదే జరిగితే.. వారి చూపు హైదరాబాద్ మీద ఉంటుందనటాన్ని కాదనలేం. హైదరాబాద్‌లో చక్రం తిప్పటానికి.. తాము అనుకున్నది జరగటానికి వీలుగా బీఆర్ఎస్‌లో చేరే ఆంధ్ర నేతల కారణంగా తెలంగాణ వారికి నష్టం వాటిల్లటం ఖాయమన్న మాట కూడా వినిపిస్తోంది.ఏ ఆంధ్రోళ్ల బూచి చూపించి ప్రత్యేక తెలంగాణ అని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు అదే ఆంధ్రోళ్లకు సైతం ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. మరి.. అలాంటి వేళలో.. ఆంధ్రోళ్లకు పెరిగే ప్రాధాన్యం తెలంగాణ వారికి తగ్గించేలా చేస్తుందన్న ప్రశ్నకు ఆయనేం సమాధానం చెబుతారు? అన్నదే ఇప్పుడు అసలు సందేహం. కేసీయార్ పుణ్యమే కదా ఇపుడు విభజన ఏపీ గాయాల పాలు అయి నిలువుగా ఇబ్బందులు పడుతోంది. ఇపుడు భారత రాష్ట్ర సమితి అధినేత హోదాలో ఏపీకి వెళ్తే ఆయనను జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. నిజానికి తెలంగాణ ఏర్పడిందే ఏపీపై ద్వేషంతోను.. ఏపీ నేతలపై కోపంతోను.. మరి అలాంటి ఏపీ వాళ్లను చేర్చుకునేందుకు కేసీఆర్ సిద్ధపడినా.. వాళ్లు రెడీగా ఉంటారా అన్న చర్చ కూడా సాగుతోంది.

ఇవి కూడా చదవండి: