PM Awas Yojana: నెరవేరనున్న సొంతింటి కల.. ఉచిత ఇంటి నిర్మాణానికి దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే?

PM Awas Yojana: కేంద్ర ప్రభుత్వం అందరికీ గృహాలు అనే లక్ష్యంతో 2015లో ప్రధాన్‌మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని పేదలందరికీ అందుబాటు ధరలో, సురక్షితమైన, గృహాలను అందించడమే లక్ష్యంగా ప్రారంభించింది. ముఖ్యంగా ఈ పథకం ద్వారా పట్టణ ప్రాంతాల్లో నివసించే ఆర్థికంగా వెనకబడిన వర్గాలు, తక్కువ ఆదాయ వర్గాలు, మధ్య ఆదాయ వర్గాల వారికి ప్రయోజనం చేకూరుతుంది. అయితే కేంద్రం 2024 బడ్జెట్‌లో ఈ పథకం యొక్క రెండవ దశను ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే రానున్న 5ఏళ్లల్లో కోటి కుటుంబాలకు శాశ్వత ఇళ్లు లభించనున్నాయి.
ప్రధాన్‌మంత్రి ఆవాస్ యోజన ఉద్దేశ్యాలు..
లబ్దిదారులకు ఇంటి నిర్మాణం, కొనుగోలు, లేదా విస్తరణ కోసం ఆర్థిక సహాయం అందిస్తుంది. అలాగే ఇళ్లతో పాటు మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్ వంటి కనీస సౌకర్యాలను కల్పిస్తుంది. ఈ పథకం నాలుగు ప్రధాన విభాగాల ద్వారా లబ్ధిదారులకు ఇళ్లను అందిస్తోంది. అయితే, గతంలోనే మీకు సొంత స్థలం ఉంటే.. ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికి లేదా ఇప్పటికే ఉన్న ఇంటిని రీ కన్ స్ట్రక్చన్ చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం రూ.1.5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఇది ఆర్థికంగా వెనకబడిన వర్గానికి చెందిన లబ్ధిదారులకు మాత్రమే వర్తిస్తుంది.
క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ పథకం:
హౌజ్ లోన్ తీసుకునే వారికి సబ్సిడీని అందించడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు చెందిన వారికి ఇంటి రుణాలపై 6.50 శాతం వరకు వడ్డీ సబ్సిడీ లభిస్తుంది. గరిష్టంగా రూ.6 లక్షల లోన్ మొత్తానికి సబ్సిడీ వర్తిస్తుంది.
MIG-I: సంవత్సరానికి రూ.6 లక్షల నుంచి రూ.12 లక్షల ఆదాయం ఉన్న వారికి ఇంటి లోన్ లపై 4 శాతం వరకు వడ్డీ సబ్సిడీ లభిస్తుంది. గరిష్టంగా రూ.9 లక్షల రుణ మొత్తానికి ఇది వర్తిస్తుంది.
MIG-II: సంవత్సరానికి రూ.12 లక్షల నుంచి రూ.18 లక్షల ఆదాయం ఉన్న వారికి గృహ రుణాలపై 3 శాతం వరకు వడ్డీ సబ్సిడీ లభిస్తుంది. గరిష్టంగా రూ.12 లక్షల లోన్ మొత్తానికి ఇది వర్తిస్తుంది. ఈ సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల రుణ ఖాతాకు జమ చేస్తారు.
భాగస్వామ్యంతో ఇళ్ల పంపిణీ..
రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల భాగస్వామ్యంతో ప్రభుత్వాలు లేదా ప్రైవేట్ డెవలపర్లు నిర్మించిన ఇళ్లను ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారికి అందించనుంది. కాగా, కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద ఆర్థికంగా వెనకబడిన వర్గాల లబ్ధిదారుడికి రూ.1.5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది.
ఇన్-సిటు స్లమ్ పునరావాసం:
మురికివాడల్లో నివసించే వారికి అదే స్థలంలో లేదా సమీపంలో పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వడం కూడా ఈ పథకంలో భాగంగా జరుగుతుంది .ఇక్కడ, ప్రైవేట్ భాగస్వామ్యంతో భూమిని ఒక వనరుగా ఉపయోగించుకుంటారు. కేంద్ర ప్రభుత్వం ఒక్కో లబ్ధిదారునికి రూ. లక్ష వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది.
అర్హతలు:
లబ్ధిదారులు ఏడాదికి ఆర్థికంగా వెనకబడిన వర్గాలు (సంవత్సర ఆదాయం రూ.3 లక్షల వరకు), LIG (సంవత్సర ఆదాయం రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు), MIG-I (సంవత్సర ఆదాయం రూ.6 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు), లేదా MIG-II (సంవత్సర ఆదాయం రూ.12 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు) వర్గాలకు చెందినవారై ఉండాలి. దరఖాస్తుదారులకు లేదా అతని/ఆమె కుటుంబ సభ్యులకు (భార్య/భర్త, అవివాహిత పిల్లలు) భారతదేశంలో ఎక్కడా పక్కా ఇల్లు ఉండకూడదు. ఇదివరకే ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందకూడదు: ఇదివరకే కేంద్ర ప్రభుత్వం నుంచి గృహ నిర్మాణ పథకం కింద లబ్ధి పొంది ఉండకూడదు. అలాగే ఆధార్ కార్డు తప్పనిసరి.
దరఖాస్తు చేసుకోవాలి ?
PMAY-U పథకానికి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు. PMAY (అర్బన్) అధికారిక వెబ్‌సైట్ (https://pmaymis.gov.in/) ని సందర్శించండి. ఆ తర్వాత “Citizen Assessment” విభాగంలో మీ అర్హతకు తగిన ఎంపికను ఎంచుకోండి. ఆధార్ నంబర్, వ్యక్తిగత వివరాలు, ఆదాయ వివరాలు, కుటుంబ వివరాలు మొదలైనవాటిని ఎంటర్ చేయండి. అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి. అప్లికేషన్ సమర్పించండి.