IND Vs ENG: భారీ ఆధిక్యంలో భారత్

India Lead: బర్మింగ్ హోమ్ లో జరుగుతున్న రెండో టెస్టులో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శనతో ఇంగ్లాండ్ ను 407 పరుగులకే కట్టడి చేశారు. భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ 6 వికెట్లు తీసి ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ ను దెబ్బతీశాడు. దీంతో భారత్ కు 180 పరుగుల ఆధిక్యం లభించింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 151 ఓవర్లలో 587 రన్స్ చేసింది. కెప్టెన్ శుభ్ మన్ గిల్ 269 పరుగులతో రాణించగా, జడేజా (89), జైస్వాల్ (87), వాషింగ్టన్ సుందర్ (42) తో భారీ స్కోర్ సాధించారు.
ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఇంగ్లాండ్ తడబడింది. మొదటి 5 వికెట్లు 84 పరుగులకే కోల్పోయిన అనంతరం, హ్యారీ బ్రూక్ (158), జేమీ స్మిత్ (184) కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ 300కిపైగా భారీ భాగస్వామ్య స్కోర్ సాధించి ఇంగ్లాండ్ ను గౌరవప్రదమైన స్థితికి చేర్చారు. బ్రూక్ ఔటైన తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్, చివరకు 89.3 ఓవర్లలో 407 పరుగులకు ఆలౌట్ అయింది.
ఇక భారత బౌలింగ్ లో సిరాజ్ తన సత్తా చాటాడు. 19.3 ఓవర్లలో 70 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీయగా, ఆకాష్ దీప్ 4 వికెట్లు తీసి సిరాజ్ కు సహకారం అందించాడు. మిగిలిన బౌలర్లు వికెట్లు తీసేందుకు ఇబ్బంది పడ్డారు. భారత్ రెండో ఇన్నింగ్స్ లో 200- 250 పరుగులు చేస్తే.. ఇంగ్లాండ్ కు 400కి పైగా లక్ష్యం ఉంటుంది. నాలుగు, ఐదో రోజు స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉండటంతో భారత్ ఈ మ్యాచ్ లో గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉంది.