Last Updated:

SLBC Tunnel : ఎస్ఎల్‌బీసీ ట‌న్నెల్‌ నుంచి మరో మృతదేహం వెలికితీత

SLBC Tunnel : ఎస్ఎల్‌బీసీ ట‌న్నెల్‌ నుంచి మరో మృతదేహం వెలికితీత

SLBC Tunnel : ఎస్ఎల్‌బీసీ సొరంగంలో నెల రోజుల క్రితం ప్రారంభించిన రెస్క్యూ ఆప‌రేష‌న్ పురోగ‌తి సాధించింది. ఇవాళ రెస్క్యూ ఆప‌రేష‌న్‌కు వెళ్లిన సిబ్బందికి మరో మృత‌దేహం ఆన‌వాళ్లు క‌నిపించాయి. మృత‌దేహాన్ని వెలికి తీసి మధ్యాహ్నం బ‌య‌ట‌కు తీసుకొచ్చారు. మృతుడి యూపీకి చెందిన మ‌నోజ్ కుమార్‌గా గుర్తించారు. టన్నెల్‌లో ఏఈగా విధులు నిర్వర్తిస్తూ ప్ర‌మాదంలో చిక్కుకున్నారు.

 

 

సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్న రెస్క్యూ టీంకు టీబీఎం శిథిలాల కింద దుర్వాసన వచ్చింది. దీంతో తవ్వకాలు చేపట్టారు. తవ్వకాలు చేపడుతుండగా ఆనవాళ్లు గుర్తించారు. ఈ క్రమంలో లోకో రైలులో అధికారులు లోప‌ల‌కు వెళ్లారు. పూర్తి స్థాయిలో త‌వ్వ‌కాలు చేప‌ట్టాల‌ని సూచించారు. టీబీఎం శిథిలాలను గ్యాస్ కట్టర్లతో తొలగించారు. సొరంగంలో ఫ్రంట్ లైన్ నుంచి 30 మీటర్ల దూరంలో గుర్తించారు. శ‌వ పంచనామా అనంతరం పోస్టుమార్టం కోసం నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 

 

32 రోజులుగా..
ఎస్ఎల్‌బీసీ సొరంగంలోని నెల‌ రోజులుగా చేప‌ట్టిన‌ రెస్క్యూ ఆపరేషన్‌లో పురోగ‌తి క‌నిపించింది. 32వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్న సందర్భంగా సొరంగంలో మరో మృతదేహం ఉన్న‌ట్లు సిబ్బంది గుర్తించారు. కన్వేయర్ బెల్ట్‌కి 50 మీటర్ల దూరంలో రెస్క్యూ సిబ్బంది మరో మృతదేహాన్ని గుర్తించారు. హిటాచీతో మట్టి, నీరు తవ్వుతుండగా మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని వెలికితీసేందుకు రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

 

 

ప్ర‌త్యేకాధికారి ఆధ్వ‌ర్యంలో..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేర‌కు ఐఏఎస్ అధికారి శివ‌శంక‌ర్ లోతేటిను ప్ర‌త్యేకాధికారిగా సీఎస్ శాంత‌కుమారి నియ‌మంచారు. శివ‌శంక‌ర్ ఆధ్వ‌ర్యంలో 32వ రోజు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సహాయక చర్యల్లో 25 టీంలుగా 700 మంది రెస్క్యూ సిబ్బంది పాల్గొన్నారు. సొరంగంలో ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఆరుగురి కోసం స‌హాయ‌క‌ చర్యలు కొనసాగుతున్నాయి.

 

 

త్వరలో రెండు మృతదేహాలు గుర్తించే అవకాశం..
సొరంగంలో ఈ నెల 9న గురుప్రీత్ సింగ్ మృతదేహం లభ్యం కావడంతో రిస్క్ బృందాలు పురోగతిని సాధించాయి. 32 రోజుల అనంతరం మరో మృతదేహం లభించింది. సహాయక చర్యలు కొనసాగిస్తున్న ప్రదేశంలోనే మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో త‌వ్వ‌కాలు చేప‌ట్టి బ‌య‌ట‌కు తీసుకొచ్చే అవ‌కాశం ఉంది.

ఇవి కూడా చదవండి: