Hyderabad : ఎర్రగడ్డ ఆసుపత్రిలో కలుషిత ఆహారం ఘటనపై సర్కారు సీరియస్
Erragadda Hospital : ఎర్రగడ్డ మానసిక ఆరోగ్య కేంద్రంలో కలుషిత ఆహారం ఘటనపై తెలంగాణ సర్కారు సీరియస్ అయింది. ఆసుపత్రిలో ఆహార పదార్థాల సరఫరా కాంట్రాక్టర్ జైపాల్‌రెడ్డిని తొలగిస్తూ దవాఖాన సూపరింటెండెంట్ ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం ఆర్‌ఎంవో డాక్టర్ పద్మజను సస్పెండ్ చేసింది. కలుషిత ఆహారం ఘటనలో ఓ రోగి మృతి చెందగా, 92 మంది అస్వస్థతకు గురయ్యారు. 18 మందిని మెరుగైన వైద్యం కోసం ఉస్మానియాకు తరలించారు.
డిశ్ఛార్జి కమిటీ వార్డులో ఉంటున్న భూపాలపల్లికి చెందిన కరణ్ (30) అనే వ్యక్తి తీవ్ర అస్వస్థతతో మంగళవారం ఉదయం మృతిచెందడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఉస్మానియా ఆసుపత్రి నుంచి ప్రత్యేక బృందాన్ని రప్పించి పర్యవేక్షిస్తున్నారు. మిగిలిన బాధితుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆసుపత్రిలో ప్రత్యేకంగా చక్కెర పరమాన్నం చేశారు. దీంతోపాటు అన్నం, కూర, అరటి పండ్లు, గుడ్లను రోగులకు పెట్టారు. సాయంత్రం డీసీ వార్డు, కోర్టు వార్డుల్లో 71 మంది రోగులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో వైద్యాధికారులు వారికి చికిత్స అందించారు.
డీసీ వార్డులో ఉన్న కరణ్ జ్వరం, ఇతర సమస్యలతో అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతిచెందాడు. ఎర్రగడ్డ ఆసుపత్రిలో నల్లా నీటిని ఆర్వో ప్లాంట్లకు పంపి వాటి ద్వారా రోగులకు సరఫరా చేస్తున్నారు. స్టీలు బిందెల్లో పట్టిన నీటిని రోగులు గ్లాసులతో ముంచుకుని తాగుతుంటారని అధికారులు తెలిపారు. తాగునీరు కలుషితమైందా అనే కోణంలో పరిశీలిస్తున్నారు. ఘటనకు సంబంధించిన కారణాలను తెలుసుకునేందుకు నమూనాలను పరీక్షలకు పంపామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనిత తెలిపారు.