Badi Baata: నేటి నుంచి బడిబాట.. కార్యచరణ రెడీ చేసిన విద్యాశాఖ
Telangana Government: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచడమే లక్ష్యంగా ప్రతి ఏటా విద్యాశాఖ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి జూన్ 6 నుంచి జూన్ 19 వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టి, విద్యార్థులను బడిలో చేర్పించేలా కార్యచరణ సిద్ధం చేసింది. ఈ మేరకు టీచర్లు బాలకార్మికులను, బడి బయట పిల్లలను, అనాథలను, అంగన్వాడీ చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ప్రీప్రైమరీ స్కూల్స్, నోట్ బుక్స్ పంపిణీ తదితర కొత్త ప్రణాళికలతో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచే ప్రయత్నం చేస్తోంది. కాగా పాఠశాలలను విధిగా తనిఖీ చేసి, విద్యార్థుల సంఖ్యను పెంచేలా కృషి చేయాలని అధికారులను విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఆదేశించారు.
కాగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచేలా ప్రభుత్వం పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో కలెక్టర్ స్థాయి నుంచి మొదలుకొని డీఈఓ, మండలస్థాయి విద్యాశాఖ అధికారులు, మహిళా సంఘాలు, గ్రామస్తులను భాగస్వామ్యం చేశారు. ప్రభుత్వం అందించిన విధివిధానాలకు అనుగుణంగా బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు చెప్పారు. కరపత్రాల పంపిణీ, బ్యానర్ల ఏర్పాట్లు, సర్కారు బడిలో చదవడం వల్ల వచ్చే ఉపయోగాలు, అనుభవం కలిగిన టీచర్లు, ఫ్రీ యూనిఫాం, పుస్తకాలు, మధ్యాహ్న భోజనం ఇలా అన్ని ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తూ ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ స్కూల్స్ టీచర్లు ప్రచారం చేయనున్నారు. తమ స్కూల్ లో పదోతరగతి విద్యార్థులు సాధించిన వివరాలను తల్లిదండ్రులకు చెబుతూ గవర్నమెంట్ బడిలో చేర్పించేలా ప్రోత్సహించనున్నారు.